Telugu Gateway
Politics

సీఏఏ హిందూ..ముస్లింల సమస్య కాదు..ఇది దేశ సమస్య

సీఏఏ హిందూ..ముస్లింల సమస్య కాదు..ఇది  దేశ సమస్య
X

తెలంగాణ సర్కారు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి కెసీఆర్ స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టి తాము ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నదీ స్పష్టంగా ప్రకటించారు. ఏదో ఆషామాషీగా తాము ఈ నిర్ణయం తీసుకోలేదని..అన్నీ అధ్యయనం చేసిన తర్వాతే తమ అభిప్రాయాలు చెబుతున్నామని తెలిపారు. పార్లమెంట్ లో కూడా తమ పార్టీ సీఏఏ బిల్లును వ్యతిరేకించిందని గుర్తుచేశారు. రాక్షసానందం పొందుతూ పౌర చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రానికి స్పష్టం చేశారు. భిన్న స్వరూపం, వందల ఏళ్ల కాస్మోపాలిటిన్‌ కల్చర్‌, భిన్న సంస్కృతులకు ఆలవాలంగా ఉన్న తెలంగాణ సీఏఏపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ పౌరసత్వ చట్టంపై గత కొద్ది రోజులుగా అనేక వర్గాలు వారి వారి పద్ధతుల్లో నిరసనలు తెలియజేశాయని తెలిపారు. దేశంలో ఇప్పటికే ఏడు రాష్ట్రాలు.. కేరళ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయని, తమది ఎనిమిదో రాష్ట్రమని సీఎం తెలిపారు.

ఆందోళనలను సృష్టిస్తున్న సీఏఏని పునఃసమీక్షించాలని కేంద్రాన్ని కోరారు. ‘సీఏఏ అమలు తప్ప దేశంలో వేరే సమస్యే లేదన్నట్టు, ఏదో కొంపలు మునిగినట్టు ఇదొక్కటే సమస్య అన్నట్టు కేంద్రం ప్రవర్తిస్తోంది. ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, దేశ సమస్య. నాకే బర్త్ సర్టిఫికెట్ లేదని ఇదివరకే చెప్పాను. నా ఒక్కడి పరిస్థితి ఇలా అంటే దేశంలో అనేక మందికి ధ్రువీకరణ పత్రాలు లేవు. నిన్ను ఎవరు బర్త్ సర్టిఫికెట్ అడిగారు అని నన్ను అంటున్నారు. ఒక్క మాట అడుగుతా సమాధానం చెప్తారా. ఓటర్ ఐడి, ఆధార్, రేషన్ కార్డ్ ఏవీ కూడా పని చేయవని అంటున్నారు. దేశంలో కోట్ల మందికి బర్త్ సర్టిఫికెట్ లేదు వారి పరిస్థితి ఏంటి. దీనికి కేంద్రం సమాధానం చెప్పాలి’ అని సీఎం పేర్కొన్నారు. 50 మందికి పైగా యువత సీఏఏ గోడవల్లో మృత్యువాత పడ్డారు.

తాత్కాలికంగా విద్వేషాలను రెచ్చగొడితే దేశానికి మంచిది కాదు. ప్రపంచవ్యాప్తంగా భారత దేశం ప్రతిష్ట దెబ్బతింటోంది. బీజేపీ కి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహి అనే బిరుదు ఇస్తున్నారు. 2003లోనే దేశంలో చాలా రాష్ట్రాల్లో సర్వే చేసి కుదరదని ఆపేశారు. పాకిస్తాన్ ఏర్పాటు సమయంలో ఇండియా నుంచి పాకిస్తాన్- పాకిస్తాన్ నుంచి ఇండియా కు అనేక మంది వచ్చారు. బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో వేల మంది ఇండియాకు వలస బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. దూల్ పేట్ లో ఉన్న చాలా మంది తెలంగాణ ప్రజలు కాదు. ఎమ్మెల్యే రాజాసింగ్ లోదా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. భారత రాజ్యాంగం కులమతాలకు అతీతంగా ఉంటుంది. బీజేపీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ముస్లిం లను మినహాయించి అని బిల్లు తెచ్చింది. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం. అందుకే దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

Next Story
Share it