Telugu Gateway
Telangana

కెసీఆర్ సర్కారు నిర్ణయం..ప్రైవేట్ ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్

కెసీఆర్ సర్కారు నిర్ణయం..ప్రైవేట్ ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్
X

కేంద్రం సూచనలకు భిన్నంగా తెలంగాణ సర్కారు నిర్ణయం!

కరోనా విస్తృతిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర సర్కారు అందరికీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలోని అన్ని పబ్లిక్, ప్రైవేట్ కంపెనీలు వేతనాల్లో కోత పెట్టొద్దని..అదే సమయంలో లేఆఫ్స్ కూడా చేయవద్దని కోరింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి హీరాలాల్ సమారియా సూచించారు. అదే సమయంలో క్యాజువల్, కాంట్రాక్ట్ వర్కర్లను తొలగించవద్దని, వేతనాల్లో కోత విధించవద్దని సూచించింది. ఈ తరుణంలో తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు సర్కారు నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా..ప్రభుత్వ నిర్ణయం ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కన్పిస్తోంది. కేంద్రం చెప్పిన దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో తాత్కాలిక కోత పెట్టడం కలకలం రేపుతోంది. ఈ పరిణామం తమపై ఎలా ప్రభావం చూపుతుందో అన్న భయం రాష్ట్రంలోని ప్రైవేట్ ఉద్యోగులపై పడింది.

నిధుల్లేక ఏకంగా ప్రభుత్వమే వేతనాల్లో కోతలు పెడితే ప్రైవేట్ యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయో అన్న టెన్షన్ అన్ని రంగాల ప్రైవేట్ ఉద్యోగుల్లో నెలకొంది. అది కాకుండా ప్రైవేట్ కంపెనీలను కూడా పూర్తిగా వేతనాలు ఇవ్వమని కేంద్రం సూచిస్తే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే వేతనాల్లో కోత పెట్టడం అందరిలో ఆందోళన రేపుతోంది. కరోనా కారణంగా రాష్ట్ర సర్కారు ఆదాయానికి గండిపడిన వాస్తవమే అయినా కూడా వేతనాల్లో కోత వల్ల లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టినా సర్కారు ప్రైవేట్ ఫ్యాక్టరీల యాజమానులను మాత్రం వేతనాలు చెల్లించాల్సిందిగా కోరింది. ఈ మేరకు తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కూడా ప్రకటనలు చేశారు.

మరి ప్రభుత్వం ఉద్యోగుల్లో కోతలు పెడితే..ప్రైవేట్ యాజమాన్యాలు సర్కారు మాట వింటాయా?. సర్కారు కూడా మొత్తం జీతం ఇవ్వాల్సిందే అని చెప్పే నైతిక హక్కును కూడా కోల్పోయినట్ల అయిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. తెలంగాణ సర్కారు నిర్ణయం ప్రైవేట్ కార్మికులపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచిచూడాల్సిందే. వాస్తవానికి తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం వేతనాల్లో కోత కాదు...ఇప్పుడు మార్చి నెల వేతనాల్లో కోత విధించే మొత్తాన్ని తర్వాత సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు అనేది సర్కారు ఆర్ధిక వెసులుబాటును బట్టి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ వేతనాల్లో కోత అనేది మార్చి వరకూ పరిమితం అవుతుందా? లేక ఏప్రిల్ నెలలోనూ కొనసాగుతుందా అనేది వేచిచూడాల్సిందే.

Next Story
Share it