Telugu Gateway
Politics

కెసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

కెసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ
X

22 వేల కోట్లతో కాళేశ్వరం టెండర్లకు ఇది సమయమా

లాక్ డౌన్ లో ప్రజాభిప్రాయ సేకరణ ఎలా జరుపుతారు?

‘కాళేశ్వరం ప్రాజెక్టులో మూడవ టీఎంసీ నీటి పంపింగ్ కు సంబంధించి ఎనిమిది ప్యాకేజీలుగా 22,290 కోట్ల విలువైన టెండర్లకు రంగం సిద్ధం చేశారు. ఇందులో 11,710 కోట్ల రూపాయల విలువ గల పనులకు సోమవారం టెండర్లు పిలిచారు. మరో 10,580 కోట్ల రూపాయల విలువ గల పనులకు టెండర్లు పిలవబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కరోనా కారణంగా ప్రభుత్వమే లాక్ డౌన్ విధించిన తరుణంలో కాంట్రాక్ట్ సంస్థలు సిబ్బందికి సెలవులు ప్రకటించాయి. తీరా ఇఫ్పుడు టెండర్లు పిలిస్తే క్షేత్రస్థాయికి సాంకేతిక సిబ్బందిని పంపి, అంచనాలు సిద్ధం చేసుకుని టెండర్లలో పాల్గొనే వెసులుబాటు ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో టెండర్లు పిలవటం చూస్తుంటే పోటీని నివారించి, కొన్ని కాంట్రాక్టు సంస్థలకు మేలు చేయటం కోసం చేసిన చర్యగా కన్పిస్తోంది. తక్షణం ఈ టెండర్లను వాయిదా వేయాలి, లేనిపక్షంలో దురుద్దేశాలు ఉన్నాయని చేసుకోవాల్సి ఉంటుంది’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పలు అంశాలను లేవనెత్తుతూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం నాడు సీఎం కెసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మా సిటీ భూ సేకరణ కోసం రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఏప్రిల్ 3న అందుకోసం సభ నిర్వహిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించి భూ సేకరణ కోసం 3న సభ ఎలా నిర్వహిస్తారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజలు గుంపులు గుంపులుగా వస్తారని తెలియదా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల వేతనాల కోతపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. నాలుగో తరగతి, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం సరికాదు. ఉన్నతోద్యోగులను, చిరు ఉద్యోగులను ఒకే గాటన కట్టడం సరైన నిర్ణయం కాదు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్య, పారా మెడికల్ సిబ్బందికి తమిళనాడు తరహాలో ప్రోత్సాహాకాలు ఇవ్వాలి. అందుకు విరుద్ధంగా వారి జీతాల్లో కూడా కొత విధించడం నిబద్ధతను తక్కువ చేస్తోంది. ఈ మూడు నిర్ణయాలను పునః సమీక్షించి జనామోద నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానుఅని రేవంత్ రెడ్డి తెలిపారు. వారం రోజుల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల జీతాల గురించి ఏమి మాట్లాడారో ఒక సారి గుర్తుకుతెచ్చుకోండి అని కోరారు.

నెలలో చివరి పది రోజులు లాక్ డౌన్ లో ఉన్నా ఉద్యోగులకు ఆయా సంస్థలు పూర్తి జీతాలు చెల్లించాల్సిందేనని ఆదేశించారు. తీరా ఇఫ్పుడు మాట మార్చి ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలతో దారుణమైన కోత విధించారని విమర్శించారు. ఈ నిర్ణయం విషయంలో కొంత విచక్షణ పాటిస్తే బాగుండేదని పేర్కొన్నారు. దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రభుత్వం సంయమనంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వ అధినేతగా మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్నాయి. బాధ్యత గల ప్రతిపక్షంగా సమయం, సందర్భం దృష్టిలో పెట్టుకొని వాటిని లేవనెత్తకుండా సంయమనం పాటిస్తున్నామని తెలిపారు.

Next Story
Share it