Telugu Gateway
Politics

దుమారం రేపుతున్న గోగోయ్ కు రాజ్యసభ వ్యవహారం

దుమారం రేపుతున్న గోగోయ్ కు రాజ్యసభ వ్యవహారం
X

రిటైర్డు సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన్ గోగోయ్ కు రాజ్యసభకు నామినేట్ చేసిన వ్యవహారంపై పెద్ద దుమారం రేగుతోంది. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతోపాటు రాజకీయ పార్టీలు కూడా ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేయటం కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. అంతే కాదు..ఓ మహిళ నుంచి ఆయన తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. లైంగికంగా వేధించారని ఆయన దగ్గర పనిచేసే మహిళ ఆరోపించటం..తర్వాత ఈ కేసు క్లోజ్ అవటం తెలిసిందే. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినందుకు గొగోయ్‌ను పెద్దల సంభకు పంపారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర​ నేత, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ పలు వ్యాఖ్యలు చేశారు.

‘నాకు మీ రక్తం ఇ‍వ్వండి.. నేను మీకు స్వాతంత్య్రం తీసుకువస్తాను.. అని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ గతంలో పిలుపునిచ్చారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం.. మాకు అనుకూలంగా తీర్పులు ఇవ్వండి. మీకు ఉన్నత పదవులు కట్టబెడతాను అని న్యాయవ్యవస్థను కూడా మేనేజ్‌ చేస్తున్నారు. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తోంది’ అని ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్రాలు సంధించారు. బీజేపీ సిద్దాంతాలకు లోబడి తీర్పులు ఇచ్చినందుకు గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేశారని అభిషేక్‌ మను సింఘ్వీ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది కేటీఎస్‌ తులసి రిటైర్మెంట్‌తో ఖాళీ అయిన స్థానంలో జస్టిస్‌ గొగోయ్‌ని కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేస్తూ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

సుదీర్ఘ న్యాయవాద వృత్తిలో గొగోయ్‌ అనేక సార్లు వార్తలు నిలిచారు. గత ఏడాది నవంబర్‌ 9న సున్నితమైన అయోధ్య కేసులో తీర్పు ప్రకటించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్‌ గొగోయ్‌ నేతృత్వం వహించి చరిత్రలో నిలిచిపోయారు. రాఫేల్‌ ఫైటర్‌ జెట్స్‌ కేసును, శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసును కూడా ఆయన విచారించారు. అయోధ్య కేసులో 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామాలయ నిర్మాణం కోసం వినియోగించాలని ఆయన తీర్పునిచ్చారు. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని మరో ప్రముఖ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. రఫేల్‌ ఫైటర్‌ జెట్‌ డీల్‌లో మోదీ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన ధర్మాసనానికి కూడా జస్టిస్‌ గొగొయే నేతృత్వం వహించారు.

Next Story
Share it