Telugu Gateway
Politics

త్వరలోనే విద్యుత్ ఛార్జీల పెంపు

త్వరలోనే విద్యుత్ ఛార్జీల పెంపు
X

తెలంగాణలో త్వరలో విద్యుత్ ఛార్జీల పెరగనున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే పేదలపై భారం పడకుండానే ఈ పెంపు ఉంటుందని అన్నారు. తాము ప్రజలను మభ్యపెట్టి చందమామను తెస్తామనో..ఇంకొకటి తెస్తామనో అబద్దాలు చెప్పం అని వ్యాఖ్యానించారు. విద్యుత్ సంస్థలు బతికి బట్టకట్టాలంటే ఛార్జీలు పెంచకతప్పదని అన్నారు. విద్యుత్ ఛార్జీలతో పాటు పన్నుల్లో కూడా పెంపు ఉంటుందని సంకేతాలు ఇచ్చారు.. ఏది చేసినా తాము చెప్పే చేస్తామన్నారు. పెంచిన ఛార్జీలు అయినా..పన్నులు అయినా తిరిగి ప్రజల సంక్షేమం కోసమే వాడతామని తెలిపారు. దళితులు, గిరిజనులకు 101 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నామని.. వాళ్లకు ఎలాంటి పెంపు ఉండదన్నారు. శుక్రవారం అసెంబ్లీలో పల్లె ప్రగతిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీరాజ్‌ చట్టాన్ని కఠిన తరం చేశామని చెప్పారు. జవాబుదారీతనం లేని ఉద్యోగులను తీసేస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు సక్రమంగా నిధులు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు కూడా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి చాలా మంది విరాళాలు ఇచ్చారని.. వారికి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు.

పల్లెప్రగతి ద్వారా గ్రామీణ తెలంగాణ స్వరూపం మారుతోందన్నారు. మూడు వేలకు పైగా గిరిజన ప్రాంతాలను పంచాయతీలుగా మార్చామని అన్నారు. గిరిజనుల సెంటిమెంట్లను గౌరవిస్తున్నట్టు తెలిపారు. గ్రామాలు, పట్టణాలు బాగుపడాలంటే అక్కడ ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం సంయుక్తంగా కలసి చేస్తేనే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం, నగరాలు, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పన్నులు వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఓట్ల కోసం భయపడి తాము నిర్ణయాలు తీసుకోకుండా ఉండబోమని అన్నారు. ప్రతి గ్రామానికి ఐదు లక్షల రూపాయల ఆదాయం వచ్చేలా చట్టంలో చేర్చామని వెల్లడించారు. గ్రామాలు బాగుపడాలంటే పంచాయతీలే సరిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పంచాయతీలకు, పట్టణాల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు.

Next Story
Share it