మరో పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు రావొచ్చు

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోకి మరో పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని అన్నారు. పార్టీ మారితే రాజీనామా చేయాలన్న సీఎం జగన్ వ్యాఖ్యల్లో ఎలాంటి మార్పులేదని..కొంత మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతు ప్రకటిస్తున్నారని వ్యాఖ్యానించారు. చూస్తుంటే చంద్రబాబు ప్రతిపక్ష హోదాను కూడా నిలుపుకునేటట్లు లేరని ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డి శుక్రవారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఉగాది నాడు 25 లక్షలు మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయడానికి సిద్ధం చేశామన్నారు.
ఈసీ అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని వికేంద్రీకరణతో అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ప్రాంతాల వారీగా చంద్రబాబు విబేధాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మీడియాలో కనిపించకపోతే చంద్రబాబుకు నిద్రపట్టదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును నిజ జీవితంలో మహా నటుడిగా మంత్రి పెద్దిరెడ్డి అభివర్ణించారు. గవర్నర్‌ను కలిసి ఆయన అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.