Telugu Gateway
Andhra Pradesh

జనతా కర్ఫ్యూను అందరూ పాటిద్దాం..పవన్ కళ్యాణ్

జనతా కర్ఫ్యూను అందరూ పాటిద్దాం..పవన్ కళ్యాణ్
X

ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. అందరం ప్రధాని మోడీ చేసిన పాటిద్దాం అని అన్నారు. ఈ సూచనలను తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రధాని మోడీ చేసిన సూచనలను జన సైనికులే కాక తెలుగు వారందరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 22 వ తేదీ ఆదివారాన్ని జనతా కర్ఫ్యూ గా పాటిద్దాం. ఆ రోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇళ్లకే పరిమితమవుదాం. కరోనా మహమ్మారిని నిర్మూలించడానికిగాను ప్రమాదమని తెలిసినప్పటికీ క్షేత్రస్థాయిలో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, వైద్య ఆరోగ్య సిబ్బంది, మీడియా, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రతీ ఒక్కరికీ మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుతూ మన ప్రధాన మంత్రి చెప్పినట్లు ఆదివారం సాయంత్రం అయిదు గంటలకు మన ఇంటి బాల్కనీలలో నిలబడి కరతాళ ధ్వనులు ద్వారా వారికి మన సంఘీభావం తెలుపుదాం.’ అని ప్రకటించారు.

ఈ సందర్భంగా అమెరికాలో చూసిన నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2001 సెప్టెంబర్ 11 న ట్విన్ టవర్స్ ను టెర్రరిస్టులు కూల్చి వేసినప్పుడు మరణించిన వారికి అంజలి ఘటించడానికి అమెరికన్లు అందరూ ఒకేసారి రోడ్లపైకి వచ్చి మృతులకు సంతాపం తెలిపారు.ఆసమయంలో నేను అక్కడే ఉన్నాను. ఇది అమెరికన్ల కార్యక్రమం అయినప్పటికీ సాటి మనిషిగా నేనూ పాలుపంచుకున్నాను. సామాజిక సంఘీభావ కార్యక్రమంలో మనమందరం మమేకమవడం మన విధిగా భావిస్తాను. మోదీ పిలుపునకు దేశమంతా స్పదించాలని కోరుకుంటున్నాను. నేను సైతం ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ.. ఫేస్ బుక్ లైవ్ ద్వారా మీ ముందుకు వస్తాను అని తెలిపారు.

Next Story
Share it