కరోనానే లేదు..మాస్క్ లు ఎందుకు? కెసీఆర్

తెలంగాణలో మాస్క్ లు కొరత ఉందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమర్శలకు ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీలో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో అసలు కరోనానే లేదని..అప్పుడు మాస్క్ లు ఎందుకు అని ప్రశ్నించారు. అవసరం అయితే వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయినా సరే తెలంగాణకు కరోనా రాకుండ చేస్తామన్నారు. అపోహలు... దుష్ప్రచరాలు నమ్మొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. తనతో ఒక సైంటిస్టు మాట్లాడారని.. కరోనాతో హైరానా పడాల్సిన అవసరం లేదన్నారని చెప్పారు.
పారాసెటిమల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని ఆయన సలహా ఇచ్చారన్నారు. అంతకుమించి ఏమీ లేదన్నారు. 22 సెంటిగ్రేడుల ఉష్ణోగ్రతలో ఆ వైరస్ బతకలేదని, తెలంగాణలో ఉష్ణోగ్రత ఇఫ్పటికే 30 డిగ్రీలకు చేరుకుందని అన్నారు. దండం పెట్టినా రాదని... ఆ సమస్యే రాష్ట్రానికి లేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశ జనాభా 130 కోట్లు అయితే..కేవలం 31 మందిమాత్రమే కరోనా సోకిందని తెలిపారు.



