Telugu Gateway
Andhra Pradesh

కీలకమైన ఎన్నికలను మొక్కుబడి తంతుగా మార్చారు

కీలకమైన ఎన్నికలను మొక్కుబడి తంతుగా మార్చారు
X

అత్యంత కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ సర్కారు ఓ మొక్కుబడి తంతుగా మార్చిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. పాలనా వ్యవస్థలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను సక్రమంగా నిర్వహించాల్సి ఉండగా..బెదిరింపులు, దౌర్జన్యాలతో నడిపిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. నాదెండ్ల మనోహర్ శుక్రవారం నాడు రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా బిజెపి, జనసేనలు కలసి పాలనలోకి యువత, మహిళలను తీసుకురావాలని నిర్ణయిస్తే..అధికార పార్టీ ప్రతి చోటా తమ అభ్యర్దులను భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. నామినేషన్ వేసిన అభ్యర్దులను బైండోవర్ కేసులు పేరుతో స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు. అభ్యర్ధుల వెంట ఉన్న నాయకులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. అయినా సరే బిజెపి-జనసేన కూటమి అభ్యర్ధులు దైర్యంగా ఉండి ముందుకు సాగుతున్నారని తెలిపారు. గుంటూరు జిల్లాలో నామినేషన్ వేయటానికి వెళ్లిన జనసేన పార్టీ అభ్యర్ధి పత్రాలు పోలీసు అధికారి చించివేశారని తెలిపారు. దాఖలైన నామినేషన్లను ఆర్ వో స్థాయి అధికారులు తిరస్కరిస్తున్నారని తెలిపారు.

అధికార పార్టీ మిగిలిన పార్టీలను ఇంతలా భయబ్రాంతులకు గురిచేస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాలనలో టీడీపీ జన్మభూమి కమిటీల పేరుతో ఏమి చేసిందో..ఇప్పుడు వైసీపీ అదే చేస్తోందని ఆరోపించారు. వాలంటీర్ల పేరుతో గత పాలన తరహాలోనే తప్పులు చేస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం, అభివృద్ధి వంటి వాటిపై ఏ మాత్రం ప్రణాళికలు లేవన్నారు. వెనకబడిన ప్రాంతాలకు కేంద్రం ఇచ్చే నిధులకు యూసీలు ఇవ్వకుండా..తెచ్చుకోలేకపోతున్నారనే విషయం తాము కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలసిన సమయంలో వెల్లడైందన్నారు. శనివారం నాడు పవిత్రమైన గోదావరి నదీతీరంలో మన నుడి-మన నది కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మనోహర్ తెలిపారు.

Next Story
Share it