Telugu Gateway
Politics

దేశంలో సోషల్ మీడియాపై బ్యాన్ పెట్టబోతున్నారా?!

దేశంలో సోషల్ మీడియాపై బ్యాన్ పెట్టబోతున్నారా?!
X

ప్రధాని మోడీ నిర్ణయం పంపుతున్న సంకేతాలు ఇవేనా!

సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..అన్ని దుష్పరిణామాలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఫేక్ న్యూస్ సోషల్ మీడియాను వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. ఈ ఫేక్ న్యూస్ ఎంతో మందిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయితే ప్రధాన మీడియా చాలా రాష్ట్రాల్లో అధికార పార్టీల కొమ్ముకాస్తూ అసలు విషయాలను బయటకు రాకుండా తొక్కిపెట్టేస్తున్నాయి. ఇఫ్పుడు ఆ పని చాలా వరకూ సోషల్ మీడియానే చేస్తోంది. దీని ద్వారా కొంత వరకైనా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే నచ్చని వారిపై సోషల్ మీడియాలో విషం చెప్పే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అయితే సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అన్నీ నిజమా?. కాదా అనే నిర్ధారించుకునే వెసులుబాటు ఉండదు. దీంతో కొంత మంది దీని ప్రభావానికి గురవుతున్నారు కూడా. తొలి దఫా మోడీ ప్రధాన మంత్రి కావటంలో సోషల్ మీడియా పాత్ర తక్కువేమీ కాదు. అప్పట్లో బిజెపి సోషల్ మీడియాని విజయవంతంగా ఉపయోగించుకుంది.

కానీ ప్రధాని నరేంద్రమోడీ సడన్ గా తాను అన్ని సోషల్ మీడియా ఖాతాలను ఆదివారం నుంచి వదిలేయనున్నట్లు ప్రకటించటం కలకలం రేపింది. దీంతో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీతో పాటు పలువురు సోషల్ మీడియాపై నిషేధం పెట్టబోతున్నారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీకి సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అంత క్రేజ్ ఉన్న మోడీ ఇంత సడన్ గా ఇంతటి కీలక నిర్ణయం తీసుకోవటం వెనక కారణం ఏంటి?. ప్రస్తుతం ప్రతి రాజకీయ నాయకుడు సోషల్ మీడియా ద్వారానే తమ అభిప్రాయాలు, పలు అంశాలపై తమ స్పందనలు తెలియజేస్తున్నారు.

మోడీ ప్రకటన వెనక చాలా పెద్ద ప్లాన్ ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మోడీ ప్రకటన భారత్ లో సోషల్ మీడియా నిషేధానికి ముందస్తు సంకేతమా? అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిధరూర్ ప్రశ్నించారు. మోడీ నిర్ణయం దేశ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహల్ గాంధీ కూడా మోడీ ప్రకటనపై స్పందించారు. వీడాల్సింది ద్వేషాన్ని కానీ..సోషల్ మీడియాను కాదు అని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని, దివంగత నేత వాజ్ పేయి మాజీ సహాయకుడు సుధీంద్ర కులకర్ణి కూడా ప్రధాని ట్వీట్ పై రియాక్ట్ అయ్యారు. భారత ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్చ, కమ్యూనికేషన్ పై అతి పెద్ద దాడి. త్వరలో ప్రజాస్వామ్యంపై కూడా ఇటువంటివి జరగొచ్చు అంటూ వ్యాఖ్యానించటం విశేషం.

Next Story
Share it