Telugu Gateway
Politics

కోమటిరెడ్డి ‘సొంత పార్టీ’ వ్యాఖ్యల కలకలం

కోమటిరెడ్డి ‘సొంత పార్టీ’ వ్యాఖ్యల కలకలం
X

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం నాడు చేసిన ‘సొంత పార్టీ’ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. కాంగ్రెస్ అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకోకపోతే కెసీఆర్ ను గద్దె దించేందుకు బిజెపితో కలవాలా..లేక సొంత పార్టీ పెట్టాలా అనేది నిర్ణయిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అంతిమ లక్ష్యం సీఎం కెసీఆర్ ను గద్దె దించటమే అన్నారు. ఈ విషయంలో అందరి కంటే తానే ముందుంటానని వ్యాఖ్యానించారు. కెసీఆర్ ఫ్యామిలీ అవినీతికి బ్రేక్ వేయాలి. తెలంగాణ ప్రజలకు నిజమైన బంగారు తెలంగాణ ఎలా ఉంటుందో చూపించాలి అంటూ వ్యాఖ్యానించారు. కవిత నిజామాబాద్ లో ఓడిపోగానే కెసీఆర నైతికంగా ఓటమి పాలయ్యారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేందుకు తాను రెడీగా ఉన్నట్లు ప్రటించారు. కెసీఆర్ పూర్తిగా డబ్బు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో కెసీఆర్ గెలుపు కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాల వల్లే తప్ప..కెసీఆర్ గొప్ప కాదన్నారు. టీఆర్ఎస్ పార్టీలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగీరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలు ఆయన వ్యూహాత్మకంగానే చేసినట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎప్పటి నుంచో కోమటిరెడ్డి బ్రదర్స్ తమకు పీసీసీ పగ్గాలు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. తమక పగ్గాలు అప్పగిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తామని చెబుతున్నారు. కొత్త పీసీసీ అధ్యక్షుడి విషయంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకునే సమయంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అధిష్టానానికి సంకేతాలు పంపటానికే అన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

Next Story
Share it