Telugu Gateway
Politics

తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?

తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?
X

అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజలకు అన్నీ మంచి పనులు చేస్తుంటే ఎందుకు ఎవరినీ మాట్లానివ్వకుండా చేస్తున్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు అని ప్రశ్నించారు. సీఎం కెసీఆర్, ఆయన పక్కనున్న ఓ వంద మంది బాగుంటే తెలంగాణ అంతా బాగున్నట్లు కాదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చిన ఆరేళ్ల తర్వాత కూడా నిధులు, నియామకాలు, నీళ్ళ విషయంలో ఏమి ప్రగతి సాధించామో లెక్కలు చెప్పాలన్నారు. మిషన్ భగీరధ కింద నీళ్లు ఇవ్వకలేకపోతే ఓట్లు అడగనన్న కెసీఆర్ ఇప్పుడు ఏమి చెబుతారని ప్రశ్నించారు. చాలా చోట్ల పాత పైపులు..పాత వాటితోనే పనులు చేశారని ఆరోపించారు. ఇంకా చాలా చోట్ల అసలు నళ్ళాలే రావటంలేదన్నారు. తనతో వస్తే చూపిస్తానని వ్యాఖ్యానించారు. తెలంగాణ సర్కారు తీరు అహ.నా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు ఓ కోడిని కట్టి దానివైపు చూసి అందరూ తినమన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉందని, గవర్నమెంట్‌ స్కూళ్లలో మౌలిక సదుపాయాలే లేవని విమర్శించారు. కేసీఆర్‌ తెలంగాణకు ముఖ్యమంత్రా? ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ... పాలమూరు-రంగారెడ్డిపై ఎందుకు లేదని ప్రశ్నించారు. సమస్యలు చెప్పుకుందామంటే...మంత్రులు సెక్రటేరియట్‌లో ఉండరన్నారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ ప్రాంతానికైనా వెళ్దాం...కోమటిరెడ్డిని ఉరికిచ్చి ఉరికొచ్చి కొడతారని హెచ్చరించారు. కోమటిరెడ్డి ప్రజల మధ్య తిరుగుతున్నారా?. రోడ్ల మీద తిరుగుతున్నారా? అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఎంతో బాధ కలిగించేలా ఉన్నాయని ఎర్రెబెల్లి వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ ద్రోహులను పార్టీలోకి తీసుకుంటే ఇలాగే ఉంటుందని విమర్శిస్తూ తెలంగాణ ఉద్యమంలో ఎర్రబెల్లి పాత్ర ఎక్కడిదని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. ఇది ఎర్రబెల్లి తప్పు కాదని..కెసీఆర్ ది అని వ్యాఖ్యానించారు. ఎర్రబెల్లి మితిమీరి మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story
Share it