Telugu Gateway
Politics

కరోనాపై ‘కెసీఆర్ లెక్క తప్పింది’

కరోనాపై ‘కెసీఆర్ లెక్క తప్పింది’
X

దక్షిణ కొరియాలో కరోనా కేసులు పది వేల లోపే..!

కెసీఆర్ లెక్క మాత్రం 59 వేలు

‘దక్షిణ కొరియాలో ఒక్కరితో కరోనా వైరస్ 59 వేల మందికి సోకింది. ఆ వైరస్ అంత ప్రమాదకరమైంది. ప్రజలు ఇఫ్పటిలాగా జాగ్రత్తలు పాటించటం ఒక్కటే మార్గం.’ ఇవీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదివారం రాత్రి విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. కానీ సీన్ కట్ చేసి వాస్తవాలు పరిశీలిస్తే దక్షిణ కొరియాలో ఇప్పటివరకూ నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా పది వేలు కూడా దాటలేదు. తాజా గణాంకాల ప్రకారం అక్కడ కరోనా కేసులు 9583గా ఉన్నాయి. మరి కెసీఆర్ కు ఈ 59 వేల కరోనా కేసుల లెక్కలు ఎక్కడ నుంచి వచ్చినట్లు?. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసే వాళ్లకు..పేదలకు పంపిణీ చేసే బియ్యం దోచుకోవాలనే ఆలోచన ఉన్న ఇతర దుర్మార్గులకు ముందు కరోనా సోకాలని కెసీఆర్ పదే పదే వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎవరికి కరోనా వచ్చినా మళ్ళీ వైద్యం చేయించాల్సింది ప్రభుత్వమే.

అలాంటిది ఓ ముఖ్యమంత్రి వాళ్లకు కరోనా సోకాలి..వీళ్లకు కరోనా సోకాలి అంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడటంపై కొంత మంది అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం హోదాకు ఆ వ్యాఖ్యలు ఏ మాత్రం తగని విధంగా ఉన్నాయని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వాళ్ళపై చర్యలు తీసుకుంటే ఎవరూ ఆక్షేపించరు. కానీ ఓ సీఎం ఫస్ట్ వాళ్ళకు కరోనా రావాలి..వీళ్లకు రావాలి అనే తరహాలో మాట్లాడటం ఏ మాత్రం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయంగానే ఉంది.

ముఖ్యంగా సీఎం కెసీఆర్ విలేకరుల సమావేశంలో ప్రజలకు కల్పిస్తున్న ధైర్యం..ధీమా ప్రజల్లో బాగానే పనిచేస్తోంది. కానీ తాజా విలేకరుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు ప్రతి విలేకరుల సమావేశంలో ప్రశ్నలు వేసిన మీడియాను కూడా సీఎం కెసీఆర్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న తీరు మీడియా వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రేపుతోంది. విలేకరి ఎంత హేతుబద్దమైన ప్రశ్న వేసినా కూడా ఆయన మాత్రం సమాధానం చెప్పటం ఇష్టం లేక టార్గెట్ చేయటంతోపాటు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే కారణంతో చాలా మంది మీడియా ప్రతినిధులు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.

Next Story
Share it