Telugu Gateway
Politics

ఏప్రిల్ 7 నాటికి కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ

ఏప్రిల్ 7 నాటికి కరోనా ఫ్రీ రాష్ట్రంగా   తెలంగాణ
X

ఏప్రిల్ 7 నాటికి తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కెసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటికల్లా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్వారంటైన్ లో ఉన్న వారందరినీ ఇళ్లకు పంపిస్తామని..ఇప్పుడు అందరూ చేయాల్సింది కొత్తగా కేసులు రాకుండా చూసుకోవటమే అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ, దేశీయ విమానాలు పూర్తిగా ఆగిపోయినందున కొత్త కేసులు రావని ఆశిస్తున్నట్లు..ఈ మేరకు భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. అయినా కూడా లాక్ డౌన్ ఉన్నంత కాలం ప్రజలు సహకరించాలని..ఇప్పటివరకూ బాగా సహకరించారని కెసీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు కెసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో 70 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. అందులో 11 మందికి నెగిటివ్ అని ఫలితం వచ్చిందని..మరో సారి పరీక్షలు పూర్తయిన తర్వాత వాళ్లను ఇళ్లకు పంపిస్తారని తెలిపారు.

తెలంగాణలో మొత్తం 25,935 మంది క్వారంటైన్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. వీరిని 5742 బృందాలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. అంతగా వైద్య మౌలికవసతులు, డాక్టర్ల సంఖ్య పెద్దగా లేని భారత్ వంటి దేశంలో లాక్ డౌన్ వంటి నిర్ణయాలు తప్ప..మరో మార్గంలేదన్నారు. లాక్ డౌన్ నిర్ణయానికి అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు వస్తున్నాయని కెసీఆర్ వ్యాఖ్యానించారు. దక్షిణ కొరియాలో ఒక వ్యక్తి ద్వారా కరోనా వైరస్‌ 59 మందికి సోకిందన్నారు. తెలంగాణలో 50 లక్షల ఎకరాల్లో పంట సాగు అవుతుందని కేసీఆర్‌ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంతోపాటు దేశంలో ఎక్కడా లేనట్లు ఏకంగా 30 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వరి ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ కార్పొరేషన్, మార్క్ ఫెడ్ కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. మొక్కజొన్నతోపాటు వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని..రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. అయితే ఒక పద్దతి ప్రకారం కూపన్లు ఇచ్చి..ఆ తేదీల్లోనే కొనుగోలు కేంద్రాలకు రావాలని సూచించారు. కరోనా నివారణ కోసమే మార్కెట్‌ యార్డులు మూసివేశామన్నారు. కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు కలిసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తారని అన్నారు.

రైతులందరూ విధిగా కొనుగోలు కేంద్రాలకు నియంత్రణతో సామాజిక దూరం పాటించాలని సూచించారు. పంట కొనుగోలుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని.. రాష్ట్ర ఆర్థిక వనరులన్నీ పడిపోయాయని చెప్పారు. కరోనా పరిస్థితి ఇంకా ఎంత కాలం ఉంటుందో తెలియదని.. అయినా రైతులు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని అన్నారు. ఈ సంక్లిష్ట సమయంలో అందరూ సహకరించాల్సిందేనని...పెట్రోల్, డీజిల్ అమ్మకాలు లేవని..మద్యం షాప్ లు కూడా బంద్ ఉన్నాయని, జీఎస్టీ కూడా లేదన్నారు. ఇక ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఇది ఆపద సమయం అని..అందరూ సర్దుకుని పోవాల్సిందేనని కెసీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it