Telugu Gateway
Politics

నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా కవిత

నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా కవిత
X

ముఖ్యమంత్రి కెసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవితను నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రకటించారు. ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. ఆమె బుధవారం నాడే నామినేషన్ దాఖలు చేయనున్నారు. తొలుత కవితకు రాజ్యసభ సభ్యత్వం దక్కతుందని ప్రచారం జరిగినా..అది సాధ్యంకాలేదు. ఇప్పుడు అనూహ్యంగా కవిత పేరు ఎమ్మెల్సీగా తెరపైకి వచ్చింది. రాజకీయ వర్గాల్లో ఇది ఒకింత సంచలనంగానే మారింది. నిజాబామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రకటించిన వెంటనే కవిత మంత్రుల క్వార్టర్స్ లో ఉన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో సమావేశం అయ్యారు. ఆయనతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతోనూ ఆమె సమావేశం అయ్యారు. సంఖ్యాబలం పరంగా చూస్తే కవిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో సులభంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కవిత ఎమ్మెల్సీగా వస్తుండటంతో ఆమెకు మంత్రి పదవి దక్కటం ఖాయం అన్న ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. అయితే అది ఎప్పుడు ఉంటుంది అన్నదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా సీఎం కెసీఆర్ స్థానంలో సీఎం పీఠంపై కెటీఆర్ ను కూర్చోపెడతారని టీఆర్ఎస్ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగానే కాబోయే సీఎం కెటీఆరే అంటూ బహిరంగంగా వ్యాఖ్యలు కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే సీఎంగా కెసీఆర్ ఎగ్జిట్..కవిత ఎంట్రీ ఓకేసారి ఉంటాయని అంచనాలు వెలువడుతున్నాయి.

Next Story
Share it