ఎక్కడ వారు అక్కడే..అలా అయితేనే నియంత్రణ సాధ్యం

కరోనాను అరికట్టేందుకు ఈ పధ్నాలుగు రోజులు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. ఏపీకి చెందిన వారిని సొంత రాష్ట్రానికి అనుమతించకపోవటం బాధాకరమే అయినా కూడా తప్పదని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఇది అవసరం అని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న వారు అక్కడే ఉండాలని...ఏపీలోని జిల్లాల్లో ఉన్న వారు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలన్నారు. ఒక చోట నుంచి మరో చోటకు వెళితే..వాళ్ల కాంటాక్ట్ ను కనిపెట్టడం కష్టం అవుతుందని..దేవుడి దయ వల్ల ఏపీలో ప్రస్తుతం పది కేసులే ఉన్నాయని..వీటిని పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇది మన క్రమశిక్షణతో సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రజలకు అవసరమైన ఆహార, వసతి అవసరాలను తాము చూసుకుంటామని కెసీఆర్ హామీ ఇచ్చారని..అక్కడి ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సరిహద్దుల వద్ద ఘటనలు తనను బాధించాయని వ్యాఖ్యానించారు. సీనియర్ ఐఏఎస్ లతో ఓ కమిటీ ఏర్పాటు చేశామని..ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుందని తెలిపారు. ఇందులో కొంత మంది మంత్రులు కూడా ఉంటారన్నారు.
‘ కరోనాలాంటి వైరస్ వందేళ్లకు ఓ సారి వస్తుందేమో. జీవితంలో ఒక జనరేషన్ ఒకసారి ఇలాంటి చూస్తారేమో. ఇలాంటి వైరస్‌లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోలేకపోతే భావితరాలపై ఆ ప్రభావం పడుతుంది. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఇలాంటి వ్యాధులను చూడాల్సి వస్తుందని అనుకోలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర స్థాయిలో కొత్తగా 1902 హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని..ఎవరికి ఏ అవసరం వచ్చినా దీనికి ఫోన్ చేయవచ్చని తెలిపారు. జిల్లాల్లో కూడా ఇఫ్పటికే హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారందరినీ గుర్తించి తగు చర్యలు తీసుకున్నామని..అది కాకుండా ఇఫ్పుడు రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టిన జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఉన్నా వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఏపీలో నిత్యావసరాలకు ఎలాంటి కొరతలేదని...ఎవరూ ఆందోళన చెందిన ఒకేసారి కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నారు. ఏప్రిల్ 4న ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వచ్చే మూడు వారాలు ఎవరూ ఎక్కడికీ కదలొద్దని అన్నారు. రాష్ట్రంలో 4 చోట్ల క్రిటికల్ కేర్ హాస్పటళ్లు ఏర్పాటు చేశామన్నారు. ‘ప్రతి జిల్లాలో 200 బెడ్స్ ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలో 100 పడకలు క్వారంటైన్ కోసం అందుబాటులో ఉన్నాయి.
213 వెంటిలేటర్లు సిద్ధం చేశాం. 80.9 శాతం ఇళ్లలో ఉండటం వల్లే కరోనాను ఎదుర్కోవచ్చు. 14శాతం మాత్రమే ఆసుప్రతికి వెళ్లాల్సిన కండిషన్ ఉంటుంది. 4.8 శాతం ఐసీయూ దాకా వెళ్లే అవసరం వస్తుంది. 104 హెల్ప్ లైన్ ద్వారా ఆరోగ్య సమస్యలు ఏమొచ్చినా వెంటనే సంప్రదించవచ్చు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, ఎఎన్‌ఎమ్‌లు, హెల్త్ అసిస్టెంట్లు, డాక్లర్లు మీకు అందుబాటులో ఉన్నారు. ప్రతి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను చూసి తగినంత రైతు బజార్లు అందుబాటులో ఉంచుతాం. గ్రామాలలో రైతులు, రైతు కూలీలు పొలం పనులు తప్పవు కనుక పని చేసేటప్పుడు దూరం పాటించండి. గ్రామాల్లో పారిశుధ్యం విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోమని పంచాయితీ రాజ్ శాఖను ఆదేశించాం. ప్రభుత్వం తరఫునుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలుంటాయి. వైద్యసిబ్బంది, వాలంటీర్లు, మున్సిపల్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, పోలీసు శాఖ తమ ప్రాణాలు పణంగా పెట్టి, మన వద్దకు వచ్చి సహాయం అందిస్తున్నారు. దాన్ని మనమంతా గుర్తించాలి. వారికి మనఃస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నేను చేస్తున్న వ్యక్తిగత విజ్ఞాపన ఏమిటంటే ఎక్కడివారక్కడే ఉండాలి.’ అని కోరారు.



