Telugu Gateway
Politics

ఢిల్లీ అల్లర్లపై ఇరాన్ తీవ్ర వ్యాఖ్యలు

ఢిల్లీ అల్లర్లపై ఇరాన్ తీవ్ర వ్యాఖ్యలు
X

సంచలనం సృష్టించిన ఢిల్లీ అల్లర్ల వ్యవహారంపై ఇరాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారత్ లో ముస్లింలపై ఊచకోత సాగుతోందని వ్యాఖ్యానించింది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీ తాజా ఘటనలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘భారత్‌లో జరుగుతున్న ముస్లిం నరమేధంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల హృదయాలు ద్రవించిపోతున్నాయి. హిందూ ఉగ్రవాదులను, వారి పార్టీలను భారత ప్రభుత్వం అడ్డుకోవాలి. ముస్లింలపై జరుగుతున్న ఊచకోతను ఆపాలి. ఇస్లాం ప్రపంచం నుంచి వేరుగా ఉండేందుకు చేపడుతున్న చర్యలు ఆపేందుకు భారత్‌ ఈ నిర్ణయం తీసుకోవాలి’’అని ఖమేనీ ట్వీట్‌ చేశారు. ఇందుకు ఢిల్లీ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తి భౌతికకాయం ముందు పిల్లాడు ఏడుస్తున్న ఫొటోను జతచేసి... ఇంగ్లీష్‌, ఉర్దూ, పర్షియన్‌, అరబిక్‌ భాషల్లో ట్విటర్‌లో తన ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.

ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌ జరీఫ్‌ కూడా ఢిల్లీ అల్లర్లను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ కొన్ని శతాబ్దాలుగా ఇరాన్‌ భారత్‌తో స్నేహం కొనసాగిస్తోంది. భారతీయులందరూ క్షేమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. విచక్షణారహిత అల్లర్లు చెలరేగకుండా చూసుకోవాలి. శాంతియుత చర్చలు, చట్టం ప్రకారమే ముందుకు సాగే అవకాశం ఉంటుంది. భారత ముస్లింలకు వ్యతిరేకంగా చెలరేగిన హింసను ఇరాన్‌ ఖండిస్తోంది’’ అని జావేద్‌ ట్వీట్‌ చేశారు

Next Story
Share it