Telugu Gateway
Politics

నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు

నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ, ఎన్‌పీఆర్‌పై ఆందోళన ఉన్నది వాస్తవమేనన్నారు. వందశాతం సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం పెడతామన్నారు. తనకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదని.. ఇక తన తండ్రిని తీసుకురమ్మంటే ఎలా అన్నారు. అప్పట్లో ఆస్పత్రులు సరిగా లేవని.. ఎవరికీ సర్టిఫికెట్లు ఉండవన్నారు. తనకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేకుండా నిరుపేదలు, దళితులకు ఎలా ఉంటుందన్నారు. అవసరమైతే నేషనల్‌ ఐడెంటిటీ కార్డు పెట్టండని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా చెడ్డ చర్చ సాగుతోందని..ఇది దేశానికి మంచిది కాదని హితవు పలికారు. కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇఛ్చారని ప్రశ్నించారు. ఇంటికో ఉధ్యోగం ఇస్తామని తాము చెప్పలేదని..కొత్తగా లక్ష ఉద్యోగాలు వస్తాయని మాత్రమే తాము చెప్పామన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని మేం మేనిఫెస్టోలో కూడా పెట్టలేదని కెసీఆర్ అన్నారు. పాతబస్తీకి మెట్రో రైలు తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.

అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణపై మాట్లాడితే కేసులు పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌, బీజేపీలదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఎన్నో కేసులు పెట్టి తెలంగాణను అడ్డుకోవాలని చూశారన్నారు..తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా రెండు పార్టీల కుట్రలు ఆగలేదన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఎంత నీచానికైనా దిగజారుతారని విమర్శించారు. ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్ట్‌ దక్కకుండా బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు. అభివృద్ధికి సహకరించకుండా ప్రతీదాన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక అనేక రాష్ట్రాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాయన్నారు. త్వరలో ఏపీలో కూడా 25 జిల్లాలు చేయబోతున్నారని తెలిపారు.

2014 నుంచి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోతుందని భట్టి విక్రమార్క ప్రచారం చేయని రోజు లేదన్నారు. నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో ఎక్కువ డబ్బులు పెట్టి గెలిచే వారెవరో అందరికీ తెలుసన్నారు. మిషన్‌ భగీరథను అనేక రాష్ట్రాలు ప్రశంసించాయని తెలిపారు. మిషన్‌ భగీరథ వల్ల నల్గొండలో ఫ్లోరోసిస్‌ సమస్య పోయిందని..స్వయంగా కేంద్ర జలశక్తిశాఖనే ప్రకటించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి నల్లా రాకపోతే మాకు ఓటు వేసేవాళ్లా? అని ప్రశ్నించారు. అసత్యాలు చెప్పిన కాంగ్రెస్‌ సభ్యులకు సభలో ఉండే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం చట్టబద్దంగా జరిగిందని వ్యాఖ్యానించారు. పార్టీలో చీలిక వస్తే వద్దని ఆఫుతామా? అని ప్రశ్నించారు.

Next Story
Share it