Telugu Gateway
Telangana

అవసరం అయితే ప్రైవేట్ ఆస్పత్రులూ ఉపయోగిస్తాం

అవసరం అయితే ప్రైవేట్ ఆస్పత్రులూ ఉపయోగిస్తాం
X

కరోనా వైద్య సేవల కోసం అవసరం అయితే ప్రైవేట్ ఆస్పత్రులను కూడా ఉపయోగిస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తొలుత ప్రభుత్వ ఆస్పత్రులనే ఈ సేవలకు ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 28 రోజుల్లో 47 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయని తెలిపారు. ఈటెల శుక్రవారం నాడు కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల్లో ఉండి చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని..త్వరలోనే కొంత మందిని డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉందన్నారు. త్వరలోనే కరోనా నియంత్రణలోకి వస్తుందని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వైరస్‌ వెలుగుచూసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 22 మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న పరికరాలుతో పాటు వైద్య సిబ్బంది సహకారం కూడా అందిస్తామని ముందుకు వచ్చినట్లు ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. మొదటి విడతలో ప్రభుత్వ హాస్పిటల్, రెండో విడతలో ప్రైవేట్ కాలేజీలను ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అలాగే 10వేల పడకలు, 700 ఐసీయూ, 170 వెంటిలెటర్స్‌ ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. తెలంగాణలోని కరోనా బాధితుల్లో ఏ ఒక్కరి పరిస్థితి కూడా విషమంగా లేదన్నారు. దేశం ఆశ్చర్యపోయేలా అన్ని రకాల సన్నద్దతతో తెలంగాణ సర్కారు ఉందని మంత్రి వెల్లడించారు.

Next Story
Share it