Telugu Gateway
Politics

వెనక్కి తగ్గని ట్రంప్..అదే దూకుడు

వెనక్కి తగ్గని ట్రంప్..అదే దూకుడు
X

ఎన్ని విమర్శలు వస్తున్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. పైగా తాను చెప్పిందే కరెక్ట్ అని...ఇందులో తప్పేమి ఉందని ప్రశ్నిస్తున్నారు. కరోనా వైరస్ ను ట్రంప్ తాజాగా ఓ ట్వీట్ లో ‘చైనా వైరస్’ అని సంభోధించారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. చైనా కూడా ట్రంప్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గని ట్రంప్ వైరస్ ఎక్కడ పుట్టిందో ఆ దేశం పేరుతో దాన్ని పిలవటం తప్పేమీ కాదన్నారు. ఈ వైరస్ వ్యవహారంపై ఇరు దేశాలు పరస్పరం ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అమెరికా సైన్యమే చైనాలో ఈ వైరస్ ను వదిలిపెట్టినట్లు తొలుత చైనా ఆరోపించింది. దీన్ని ఖండించిన అమెరికా..తొలుత తమ దేశంలోనే కరోనా వైరస్ వెలుగు చూసిందని ఆ దేశ అధికారులు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. కొవిడ్‌-19 వ్యాప్తికి అమెరికా సైన్యమే కారణమని చైనా దుష్ర్పచారం సాగిస్తోందని ట్రంప్‌ విమర్శించారు.

మరోవైపు అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనాతో కకావికలమైంది. అక్కడ మూడు వేల మందికి పైగా జనం వైరస్‌ బారినపడగా.. 62 మంది మరణించారు. ఇక కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తూ రోజురోజుకూ విస్తరిస్తోంది.ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 1,83,579 పాజిటివ్‌ కేసులు నమోదవగా 7,400 మందికి పైగా మరణించారు. అయితే తన చైనా వైరస్ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలపై పెద్దగా ప్రభావం చూపించే అవకాశం ఉండదని ట్రంప్ అంచనా వేస్తున్నారు. అమెరికాలో కూడా కరోనా ప్రభావం ఇలాగే కొనసాగితే ఆర్ధిక మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికిప్పుడు మాత్రం ఆ పరిస్థితులు లేవని తెలిపారు.

Next Story
Share it