జగన్ దీ కెసీఆర్ మాటే..కరోనాకు పారాసిటమాల్

కరోనా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బాటే. కరోనా కు పారాసిటమాల్ ట్యాబ్లెట్ చాలు అని తనకు ఓ నిపుణుడు చెప్పారని కెసీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ కూడా కరోనాకు పారాసిటమాల్ చాలు అని చెప్పారు. అంతే కాదు..కరోనా అనేది నిరంతర ప్రక్రియ అని..ఏడాది పాటు ఇలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయంపై గవర్నర్ కు పిర్యాదు చేసి వచ్చిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు. ఇటు వంటి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని అనుకోలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యవస్థలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘కరోనా వైరస్ అన్నది గత కొద్ది కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. చైనాలో 81 వేల మంది కరోనా వైరస్ బాధితులు కావటం. అందులో 65 వేల మందికి మళ్ళీ నయం కావటం. ఒక మూడు వేల మంది మాత్రం చనిపోవటం చూస్తున్నాం.
బేసికల్లీ కరోనా వైరస్ అన్నది ఒక ఇతర దేశాల నుంచి స్టార్ట్ అయి పలు దేశాలకు పాకుతోంది. దీని వల్ల ఏదో మనుషులు చనిపోతారు. ఇదేదో భయానక పరిస్థితి అని చెప్పి పానిక్ బటన్ నొక్కాల్సిన పరిస్థితి, అవసరం లేదు. రోగం అని చెప్పాల్సిన పనిలేదు. ఇది కేవలం 60 ఏళ్ల పైచిలుకు వయస్సు ఉన్న వాళ్ళే మరణాలకు లోను అవుతున్నారు. డయాబెటిక్ పేషంట్స్, బీపీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంట్, ఆస్తమా ఉన్న వాళ్లు ఇబ్బందిపడతారు. మెడికేషన్ ఏది అయితే ఉందో పారాసిటమాల్ . అయినా సరే చర్యలు తీసుకోవాలి..తీసుకుంటున్నాం. ఖచ్చితంగా తీసుకుంటాం. ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి అంటే మొత్తం చూస్తే..81.9 శాతం మంది ఇంట్లోనే ఉంటూ రికవరి అయ్యారు. ప్రపంచం మొత్తం మీద. 15 శాతం మాత్రమే ఆస్పత్రులకు వెళ్ళారు. కేవలం 4.7 శాతం మాత్రమే క్రిటికల్ కేసులు. ఐసీయూలో పెట్టి వైద్యం అందిస్తున్న కేసులు. దీనికి సంబంధించి మన రాష్ట్రంలో మన పరిస్థితి ఏంటి అంటే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరికీ అసౌకర్యం కలగకూడదనే అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. ఒక రెండు వారాలకు పానిక్ బటన్ నొక్కి ఓ స్థితికి తీసుకెళితే..అంతా యూటర్న్ అవుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు.
ఇది నెక్ట్స్ వన్ ఇయర్ నిరంతర ప్రక్రియ. హోమ్ ఐసోలేషన్ లో పెట్టాలి. కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం. పదిహేను రోజుల్లో అంతా అయిపోదు. స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇస్తాం. జీవితం అనేది ఆగదు. ముందుకు సాగాల్సిందే. మన రాష్ట్రానికి సంబంధించి 70 కేసులు శాంపిల్స్ కలెక్ట్ చేస్తే ఒకటే ఒకటి పాజిటివ్ కేసు. వచ్చిన వాళ్ళు కూడా చనిపోలేదు. వీళ్లు అందరూ విదేశాల నుంచి వచ్చిన వారే. వార్డుల మీద నయం అయిన కేసులు చాలా ఉన్నాయి. దేశం మొత్తం గేర్ అప్ అవుతోంది. రాష్ట్రం కూడా గేర్ అప్ అవుతుంది. రాష్ట్రంలో రెండు ల్యాబ్ లు ఉన్నాయి. కాకినాడలో కూడా ఒకటి పెట్టాలని చూస్తున్నాం. నెల్లూరులో వాలంటీర్లు పెట్టి మానిటర్ చేస్తున్నాం. ప్రొటోకాల్ పద్దతి ప్రకారం ముందుకెళుతున్నాం’ అని తెలిపారు.