Telugu Gateway
Telangana

తెలంగాణలో 33కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో 33కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
X

తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజే ఏకంగా ఆరు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారరు. కరోనా బాధితులు కోలుకుంటున్నారని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. అయితే మరో 97 మంది అనుమానితులు ఉన్నారని..వీరికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్‌ కారణంగా మరణాలు సంభవించలేదని పేర్కొన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే కరోనాను ఎదుర్కోవడం కష్టమేమీ కాదని అన్నారు. కరోనా పోరులో ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది సైతం కదిలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. డాక్టర్లు, నర్సింగ్‌ స్టాఫ్‌తో సహా ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది అందరికీ తగిన రవాణా సదుపాయాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు.

కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలన్నారు. నిత్యావసర దుకాణాలు మినహా అన్నీ బంద్‌ ఉంటాయని వెల్లడించారు. ప్రజల కోసమే కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ ఆదేశాలను తప్పక పాటించాలని చెప్పారు. ఆదేశాలను పట్టించుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగొద్దని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజులపాటు ఇళ్లల్లోనే ఉండాలని తెలిపారు. పరిస్థితులు అనూహ్యంగా మారితే కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు కార్పొరేట్‌ ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 250 నుంచి 300 వెంటిలేటర్‌ సౌక్యం ఉన్న బెడ్లు, 1000 వరకు ఐసోలేషన్‌ బెడ్ల సదుపాయాన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు కల్పిస్తాయని ఈటల పేర్కొన్నారు.

Next Story
Share it