Telugu Gateway
Andhra Pradesh

రాజధాని భూముల్లో ఇళ్ళ స్థలాలు..హైకోర్టు స్టే

రాజధాని భూముల్లో ఇళ్ళ స్థలాలు..హైకోర్టు స్టే
X

రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్న ఏపీ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు అయింది. జగన్మోహన్ రెడ్డి సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 107పై హైకోర్టు స్టే ఇచ్చింది. రాజధాని పరిధిలో లేని పేదల కోసం సర్కారు 1251 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేటాయింపులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను వేరే ప్రాంతాల వారికి కేటాయించటం సరికాదని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రాజధానిలో భూములను అక్కడి పేదలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉందన్న పిటిషనర్ తరపు న్యాయవాది.

అయితే ఇక్కడ స్థలాలను దుగ్గిరాల, విజయవాడ, మంగళగిరి వారికి కేటాయించటం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు విన్పించారు. ప్రధాని మంత్రి ఆవాస్ యోజన లో కూడా ఇళ్ల నిర్మాణం జరిగిందని, దుగ్గిరాల, మంగళగిరి సీఆర్డీఏ పరిధిలోనే వస్తాయని కోర్టు కి ప్రభుత్వ తరపు న్యాయవాది నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి..సోమవారం నాడు ఈ జీవోపై స్టే ఇస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తొలుత ఉగాది రోజున రాష్ట్రంలో 25 లక్షల మంది ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని తలపెట్టారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14కు వాయిదా వేశారు.

Next Story
Share it