ఏపీ ఇక ‘జగనాంధ్రప్రదేశ్’ గా మారబోతుందా?
తొమ్మిది నెలల్లో జగనన్న పేరుతో ఏడు పథకాలు
‘అబ్బే అసలు మా జగన్ కు ప్రచారం ఇష్టం లేదు. మేం బలవంతం చేస్తే ఒప్పుకున్నారు. బలవంతం చేసి మరీ ఆ పథకానికి జగన్ పేరు పెట్టడానికి ఒప్పించాం’ ఇదీ అసెంబ్లీ సాక్షిగా ఏపీ ఆర్ధిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పట్లో చేసిన వ్యాఖ్యలు. అమ్మ ఒడి పథకానికి జగనన్న అమ్మ ఒడి అని పేరు పెట్టిన సందర్బంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అందరూ ఇదే నిజం కాబోలు అని నమ్మారు. కానీ సీన్ కట్ చేస్తే నెలకు ఒకటి చొప్పున జగన్ పేరుతో కొత్త పథకాలు పుట్టుకొస్తున్నాయి. బహుశా రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ నిధులతో నడిచే పథకాలకు ఇన్ని పేర్లు పెట్టుకుని ఉండరు. జగన్ సీఎం అయి ఇప్పుడు తొమ్మిదో నెల నడుస్తోంది. ఇప్పటికే జగన్ పేరున ఆరు స్కీమ్ లు ఉన్నాయి. అవేంటి అంటే...జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరు ముద్ద, జగనన్న చేదోడు, జగనన్న విద్యాకానుక. ఇవి చాలదన్నట్లు బుధవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రవర్గ సమావేశంలో మరో జగనన్న పేరు వెలుగులోకి వచ్చింది.
ఉగాది రోజు ప్రభుత్వం ఇవ్వనున్న ఇళ్ళ స్థలాలకు సంబంధించిన కాలనీలకు ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’గా నామకరణం చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. దీంతో జగన్ పేరుతో ప్రారంభించిన పథకాల సంఖ్య ఏడుకు చేరుతుంది. అసలు ఏ మాత్రం ప్రచారయావ లేని, సొంత డబ్బా కొట్టుకోవటం ఇష్టం లేని జగన్ మరి ఇన్ని పథకాలకు తన పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నట్లు?. ఇవి కూడా జగన్ కు ఇష్టం లేకపోయినా మంత్రులు బలవంతం చేసి మరీ జగన్ ను ఒఫ్పిస్తున్నారా?. జగనన్న పేరుతో పథకాలు పెట్టే తీరు చూసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఇది మరీ శృతి మించుతోందని..దీని వల్ల ప్రభుత్వానికి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని వ్యాఖ్యానించారు.
ఈ తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రజలు మాకు 151 సీట్లు ఇచ్చారు కాబట్టి ఏపీ పేరును కూడా ‘జగనాంధ్రప్రదేశ్’గా మారుస్తామని అంటారేమో అని ఓ సీనియర్ అధికారి వ్యంగంగా వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పలు పథకాలకు ‘చంద్రన్న’ పేరు పెడితే ప్రభుత్వ డబ్బులతో చంద్రబాబు సొంత డబ్బా ఏంటి? ఆయన ఏమైనా దీనికి హెరిటేజ్ డబ్బులు ఖర్చు పెడుతున్నారా? అని ప్రశ్నించిన వైసీపీ నేతలు మాత్రం ఇప్పుడు నోరు విప్పటం లేదు. వైసీపీ ప్రాంతీయ పార్టీ కనుక ఏదైనా ఒకటి అరా పథకాలకు పేర్లు పెట్టుకుంటే కొంత వరకూ ఓకే కానీ..ఏకంగా రాష్ట్రంలో ప్రజల సొమ్ముతో అమలు అయ్యే పథకాలు అన్నింటికి సీఎం జగన్ తన సొంత పేరు పెట్టుకోవటం ఏమిటని అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.