Telugu Gateway
Andhra Pradesh

ఏపీ కూడా లాక్ డౌన్

ఏపీ కూడా లాక్ డౌన్
X

కరోనా కట్టడి కోసం తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నెలాఖరు వరకూ ఏపీలోనూ లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సీఎం సూచించారు. సీఎం జగన్ ప్రకటనకు ముందే తెలంగాణ సీఎం కెసీఆర్ కూడా తెలంగాణ లాక్ డౌన్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల సీఎంలు తమ తమ రాష్ట్రాల సరిహద్దులను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 12 రాష్ట్రాలు అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేశాయని, ఏపీ కూడా అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ఏపీలోనూ లాక్ డౌన్ మార్చి 31 వరకూ కొనసాగనుంది. ప్రజా రవాణా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు జగన్ తెలిపారు. ప్రభుత్వ బస్ లతోపాటు ప్రైవేట్ బస్సులు కూడా తిరగవని తెలిపారు. అయితే పదో తరగతి, ఇతర పరీక్షలు మాత్రం యధాతధంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే పరీక్షల విషయంలో ముందుకెళుతున్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. నిత్యావసరాలను ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధరలు పెరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎక్కడా కూడా పది మందికి మించి ప్రజలు గుమిగూడొద్దని కోరారు. కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారంతా 14 రోజులు ఇంట్లో నుంచి బయటకు రాకూడదని అన్నారు. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు పెట్టి బడ్జెట్ ను ఆమోదించనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సమావేశాలు కూడా అతి తక్కువ రోజులే ఉంటాయన్నారు. కరోనా నివారణకు అధికారులు బాగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. సిబ్బందికి సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఆరు కేసులు నమోదు అయితే...అందులో ఒక కేసు డిశ్చార్జి అయి వెళ్లిపోయారన్నారు. ఈ నెల 29న రేషన్ సరుకులు అందించనున్నట్లు తెలిపారు. కిలో పప్పు ఉచితంగా అందిస్తామన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏప్రిల్ 4న వెయ్యి రూపాయలు అందజేస్తామన్నారు. దీని కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అన్ని వినోద కేంద్రాలు, బార్లు వంటివి మార్చి 31 వరకు మూసివేస్తామని జగన్ తెలిపారు. ప్రభుత్వం కూడా అతి తక్కువ సిబ్బందితోనే నడుపుతామని ఆయన అన్నారు.

Next Story
Share it