Telugu Gateway
Politics

సీఏఏతో ఒక్కరి పౌరసత్వం కూడా పోదు

సీఏఏతో ఒక్కరి పౌరసత్వం కూడా పోదు
X

సీఏఏతో దేశంలో ఓ ఒక్కరి పౌరసత్వం పోదు అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. అదే సమయంలో శరణార్ధులకు మాత్రం పౌరసత్వం కల్పిస్తామని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయం అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం నాడు కోల్ కతా లో సీఏఏ అనుకూల ర్యాలీలో ప్రసంగించారు. ప్రతిపక్షాలు సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కూడా అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. మమతా దీదీ మీరు మన శరణార్ధుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆయన నిలదీశారు. మమతా బెనర్జీ కేవలం చొరబాటుదారుల క్షేమం కోసమే పాకులాడుతున్నారని, శరణార్ధుల్లో భయం రేకెత్తిస్తున్నారని ఆరోపించారు. పొరుగుదేశాల నుంచి లైంగిక దాడులు, హత్యా బెదిరింపులతో మన దేశాన్ని ఆశ్రయించిన హిందువులకు పౌరసత్వం ఇస్తే తప్పేంటని షా నిలదీశారు.

సీఏఏను మమతా బెనర్జీ అడ్డుకోలేరని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం త్వరలో పూర్తవుతుందని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో కొందరు ఆ పార్టీ కార్యకర్తలు ‘గోలీమారో’ నినాదాలు చేయడం కలకలం రేపింది. అమిత్‌ షా రాక సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో గోలీమారో నినాదాలు చేయడం గమనార్హం. బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో తొలుత కార్యకర్తలు భారత్ మాతాకీ జై, జై శ్రీరాం నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. అయితే అమిత్‌షా పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న ప్రతిపక్షాల పరిసర ప్రాంతాల్లోకి రాగానే బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. వారు సమీపంలోకి రాగానే ‘గోలీమారో... గోలీమారో’ నినాదాలను చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు స్పందించారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, ఎవరు ఆ నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గోలీమారో నినాదాలు చేయడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. హింసను ప్రేరేపించే విధంగా బీజేపీ నేతలు... కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు గోలీమారో నినాదాలు చేసినా సరే, పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గోలీమారో నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని బెంగాల్‌ సీపీఎం శాఖ డిమాండ్ చేసింది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గోలీమారో నినాదాలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

Next Story
Share it