Telugu Gateway
Andhra Pradesh

అజయ్ కల్లాం ఆ రోజు జీఎంఆర్ పై ఏమన్నారో చూడండి..!

అజయ్ కల్లాం ఆ రోజు జీఎంఆర్ పై ఏమన్నారో చూడండి..!
X

అజయ్ కల్లాం. రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సర్కారులో కేబినెట్ హోదా గల ప్రధాన సలహాదారు. అంతటి వ్యక్తి జీఎంఆర్ గురించి 2019 ఫిబ్రవరిలో ఓ వీడియోలో ఏమన్నారో చూడండి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్ కు అడ్డగోలుగా కట్టబెట్టడానికే ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి దక్కిన బిడ్ ను కేబినెట్ లో పెట్టి మరీ రద్దు చేశారని అన్నారు. గతంలో ప్రభుత్వాలు ఇంత అడ్డగోలుగా, బహిరంగంగా అవినీతి చేసేవి కావని అన్నారు. మరి ప్రస్తుతం జగన్ కు ప్రధాన సలహాదారుగా ఉన్న అజయ్ కల్లాం ఈ విషయాలు అన్నీ సీఎం జగన్ కు చెప్పారా? చెప్పినా కూడా జగన్ పట్టించుకోలేదా? అన్న విషయం ఆయనకే తెలియాలి. ఏదైతే జీఎంఆర్ కు భోగాపురం ప్రాజెక్టు అప్పగింత అవినీతి, అక్రమం అని చెప్పిన అజయ్ కల్లాం ప్రధాన సలహాదారుగా ఉన్న ప్రభుత్వానికి చెందిన కేబినెటే గురువారం నాడు పచ్చజెండా ఊపింది.

అజయ్ కల్లాం వీడియోలో వెల్లడించిన అభిప్రాయాలు సంక్షిప్తంగా..‘భోగాపురం అంతరర్జాతీయ విమానాశ్రయానికి 31.7.2017ని లాస్ట్ డేట్ పెడుతూ టెండర్లు పిలిచారు. టెండర్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సాంకేతిక అర్హత, రెండవది ఆర్ధిక అర్హత. టెక్నికల్ బిడ్స్ పిలిచినప్పుడు రెండు కంపెనీలే ఎలిజబుల్ గా వచ్చాయి. అందులోనూ రెండు కంపెనీలే నిలిచాయి. వాటిలో ఒకటి ఏఏఐ, రెండవది జీఎంఆర్. టెక్నికల్ గా ఈ రెండు క్వాలిఫై అయ్యాయి. పనికిమాలిన వాటిని డిస్ క్వాలిఫై చేశారు. ఫైనాన్సియల్ బిడ్ పిలిచినప్పుడు ఏఏఐ 30.27 శాతం ప్రభుత్వానికి ఆఫర్ చేసింది. ఈ బిడ్ లో ఏంటి అంటే ఎవరు ప్రభుత్వానికి ఎక్కువ ఇస్తున్నారు అన్నదే చూడాలి. జీఎంఆర్ 21.06 శాతం మాత్రమే ఆఫర్ చేసింది. ఆటోమేటిక్ గా 30 శాతం పైగా ఆదాయం ఇస్తున్నవారికి కళ్ళు మూసుకుని ఇచ్చేయాలి. కానీ వేరే ఆలోచనలు..అంటే అవినీతి ఆలోచనలు..ఏవో కొన్ని లోపల పెట్టుకుని భోగాపురం ఎయిర్ పోర్ట్స్ కంపెనీ లిమిటెడ్ ఫైనల్ చేయాల్సిన టెండర్ ను కేబినెట్ లో పెట్టి రద్దు చేశారు. ఏ కారణంతో అంటే ఎయిర్ పోర్ట్ లో ఏదో కాంపోనెంట్ పెట్టలేదు అని.

అవి నిజానికి చిన్న చిన్నవి పది కోట్లు..ఐదు కోట్లతో అయిపోయేవి.ఎవరైనా పెట్టుకోవచ్చు. కేవలం ఏఏఐని డిస్కరైజ్ చేయాలి. ప్రైవేట్ వ్యక్తులకే ఇవ్వాలి. జీఎంఆర్ కే ఇవ్వాలి అన్న దురుద్దేశంతోనే..మరలా క్యాన్సిల్ చేసి టెండర్లు పిలుస్తామని నిర్ణయం తీసుకున్నారు. ఏఏఐ ఛాలెంజ్ కూడా చేసింది. ఇంత ధైర్యంగా ..ఓపెన్ గా తాము అనుకున్న అవినీతి పని చేయటానికి తెగించటం అనేది ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం. ఇంత బహిరంగంగా,అడ్డగోలుగా చేయటం అనేది ప్రభుత్వాలు గతంలో చేసేవి కావు.తెగించేశారు అన్నమాట. భరించలేని విధంగా ప్రభుత్వాలు తయారయ్యాయి. ఇది వాస్తవం. ఎవరూ కాదనలేని వాస్తవం’. మరి ఇఫ్పుడు అదే జీఎంఆర్ కు చంద్రబాబు పిలిచిన టెండర్ తోనే జగన్ సర్కారు కట్టబెట్టింది. దీనిపై అజయ్ కల్లాం ఇప్పుడు ఏమి చెబుతారో?.

అజయ్ కల్లాం మాటలు ఈ వీడియోలో చూడండి

https://www.youtube.com/watch?v=I_oKcTXnsw0

Next Story
Share it