‘వరల్డ్ ఫేమస్’ లవర్ మూవీ రివ్యూ
విజయదేవరకొండ. యూత్ లో ఎంతో క్రేజ్ ఉన్న హీరో. అలాంటి హీరో సినిమా అది కూడా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టైటిల్ తో వాలంటైన్స్ డే రోజు విడుదల అవుతుంది అంటే ఆ క్రేజ్ వేరే ఉంటుంది. విజయ్ దేవరకొండ గత సినిమా ‘డియర్ కామ్రెడ్’ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంతు వచ్చింది. మరి ఈ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకుందా అంటే ఖచ్చితంగా నో అనే చెప్పాలి. చూస్తుంటే విజయ్ దేవరకొండ ఇంకా ‘అర్జున్ రెడ్డి’ హ్యాంగోవర్ నుంచి బయటకు వచ్చినట్లు కన్పించటం లేదు. అదే గడ్డం..అదే చొక్కా లేకుండా కన్పించే సీన్లు. అదే రొటీన్ వ్యవహారం. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే కాలేజీలోనే గౌతమ్ (విజయ్ దేవరకొండ), యామిని(రాశీ ఖన్నా) ప్రేమలో పడతారు. సహజంగానే వీళ్ళ ప్రేమకు యామిని తండ్రి అడ్డు చెప్పటంతో పెళ్లి కాకుండానే ఇద్దరూ కలసి జీవిస్తారు.
ఏడాది పాటు ఉద్యోగం చేసిన గౌతమ్ తనకు ఎంతో ఇష్టమైన పుస్తక రచన కోసం ఉద్యోగం మానేస్తాడు. ఆ ఏడాది తనకు సహకరించమంటాడు యామినీని. అందుకు ఆమె ఓకే చెబుతుంది. కానీ ఈ లివింగ్ రిలేషన్ ఏ మాత్రం ప్రేమ లేకుండా యాంత్రికంగా సాగిపోతుండటంతో యామిని బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. కానీ గౌతమ్ మాత్రం ఎప్పుడూ యామిని ప్రేమ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. బుక్ రాయటంలో భాగంగానే విజయ్ దేవరకొండ సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికుడిగా పనిచేసే పాత్రను క్రియేట్ చేస్తాడు. కార్మికుడిగా..కార్మిక నాయకుడిగా మారతాడు. ఈ శీనయ్య పాత్రలో విజయ్ జోడీగా ఐశ్వర్యా రాజేష్ అత్యంత సహజంగా కన్పిస్తుంది. బొగ్గు గనిలో అధికారిగా వచ్చిన క్యాథరిన్, విజయ్ ల మధ్య ప్రేమతో శీనయ్య ఫ్యామిలీలో విభేదాలు వస్తాయి. సినిమా మొత్తంలో కాస్తో కూస్తో సరదాగా ఉండే సన్నివేశాలు ఈ శీనయ్య పాత్రలోనే కన్పిస్తాయి.
అక్కడ సీన్ కట్ చేస్తే ఫ్యారిస్ వెళ్లి అక్కడ ఓ రేడియో నడుపుతాడు. అక్కడే ఎధురెదురుగా నివాసం ఉండే ఫ్లాట్స్ లో పైలట్ గా పనిచేసే ఇజబెల్లా, విజయ్ ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఓ రేస్ లో పాల్గొన్నప్పుడు ఇజబెల్లా తన చూపు కోల్పోతుంది. తర్వాత విజయ్ ఆమెకు తన కళ్లు దానం చేస్తాడు. ఒక్కో ప్రేమ కథ ఎక్కడికి అక్కడ ముగింపు లేకుండా మాయం అయిపోతాయి. ఈ ప్రేమ కథలు అన్నింటిని కలిపి రాసిన పుస్తకమే ‘వరల్డ్ ఫేమస్ లవర్’. కానీ ఏ ప్రేమ కథలో కూడా సహజంగా ప్రేమలో ఉండే ఫీల్ ఎక్కడా కన్పించదు. దర్శకుడు క్రాంతి మాథవ్ ప్రేమ సినిమాల్లో ఉండే మ్యాజిక్ ఏ మాత్రం లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాటలు కూడా ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు. ఓవరాల్ గా చూస్తే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫీల్ మిస్ అయిన ప్రేమ కథగా మిగిలిపోతుంది.
రేటింగ్.2/5