Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో మద్యం ‘బ్రాండ్ల’ నియంత్రణ వెనక మతలబు ఏమిటి?.

ఏపీలో మద్యం ‘బ్రాండ్ల’ నియంత్రణ వెనక మతలబు ఏమిటి?.
X

ఏపీ ప్రభుత్వం నిజంగా మద్యం బ్రాండ్లను పరిమితం చేయటం వెనక మద్య నియంత్రణ కోణం ఉందా?. ఆర్ధిక ప్రయోజనాల కోణం ఉందా? అంటే ఆర్ధిక ప్రయోజనాల కోణమే ఎక్కువ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెబుతున్నాయి. మద్య నియంత్రణే లక్ష్యం అయితే అన్ని బాండ్ల ధరలను పెంచేసి మద్యం నియంత్రిస్తే భారం భరించలేని వారు ఎంతో కొంత దీనికి దూరం అవుతారు. కానీ ఓ రాష్ట్ర సర్కారే ఏకంగా తమ రాష్ట్రంలో అమ్మే మద్యం బ్రాండ్లను పరిమితం చేయటం అంటే దీని వెనక భారీ వ్యవహారం ఉందని చెబుతున్నారు. ఉదాహరణకు మద్యం షాపుల్లో ఎక్కువగా ఓ బ్రాండ్ ను అమ్మితే ఆయా షాప్ లకు కంపెనీలు ప్రోత్సాహకాలు ఇస్తాయి. ఉదాహరణకు ఓ బ్రాండ్ మద్యాన్ని పది కేసులు అమ్మితే ప్రోత్సాహకం కింద ఓ ఐదు వేల రూపాయలు ఇస్తారు. ఈ ప్రోత్సాహకాలు బ్రాండ్ బ్రాండ్ కూ మారుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో రేట్ ఇస్తారు. ఒక షాప్ కే ఇంత ప్రోత్సాహకాలు వస్తే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే తమ దగ్గర ఈ బ్రాండ్లు మాత్రమే అమ్మాలని చెపితే ఇక ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. రాష్ట్రంలో అనుమతించిన మద్యం కంపెనీలు భారీ మొత్తంలో ముడుపులు ముట్టచెప్పే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆ కంపెనీల తరపున సర్కారే మార్కెటింగ్ చేస్తున్నట్లు లెక్క.

కొన్ని కంపెనీల ఉత్పత్తులను రాష్ట్రంలో ప్రభుత్వమే ‘ప్రమోట్’ చేస్తున్నట్లే అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఓ షాప్ కూ..రాష్ట్రానికి చాలా తేడా ఉంటుంది. కొన్నింటిపై ఆంక్షలు పెట్టడమే అనుమతించిన బ్రాండ్ల అమ్మకాలు ఓ రేంజ్ కు వెళతాయి. దీంతో వాటికి వచ్చే లాభాలు కూడా అంతే ఉంటాయి. అందులో కొంత వాటా ఎవరికి చేరాలో వారికి చేరుతుందని విశ్లేషించారు ఓ వ్యాపారి. సహజంగా ఓ ఉత్పత్తిని ఎంచుకునే ఛాన్స్ వినియోగదారుడికి ఉండాలి. కానీ ఎక్కడా లేనట్లు కేవలం ప్రభుత్వమే మా దగ్గర ఈ ఉత్పత్తులు మాత్రమే అమ్మాలి అని పరోక్షంగా నిర్దేశించటం వెనక మతలబు ఏమిటి?. పోనీ తాము ఎంపిక చేసిన ఉత్పత్తులు ఆరోగ్యానికి ఏ మాత్రం హాని చేయవు..మేం అనుమతించని ఉత్పత్తులు మాత్రం ఆరోగ్యానికి హాని చేసేవి అని ఎక్కడైనా ఉందా?. అంటే మందు ఏది తాగిన నష్టం ఒకటే. కానీ సర్కారు మాత్రం తాము మద్య నియంత్రణలో భాగంగానే రేట్లు పెంచి బ్రాండ్లను నియంత్రించామని చెప్పుకుంటోంది. బ్రాండ్లను నియంత్రించటం అంటే కేవలం కొన్ని కంపెనీలకు మాత్రమే మేలు చేసిపెట్టడం..వాళ్ళ దగ్గర నుంచి భారీ ఎత్తున కమిషన్లు తీసుకోవటమే అని ఓ అధికారి తెలిపారు. ఇదో కొత్త మోడల్ దోపిడీ అని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story
Share it