అసలు ‘సెలక్ట్ కమిటీ’ ఉందా..లేదా?

ప్రస్తుతం ఏపీలోని అధికార వర్గాల్లో ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. శాసనమండలి ఛైర్మన్ ఎం ఏ షరీఫ్ మాత్రం తన విచక్షణాధికారాలతో ‘సెలక్ట్ కమిటీ’కి రాజధాని వికేంద్రీకరణ, సీఆర్ డీఏ బిల్లులను పంపనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. అయితే సెలక్ట్ కమిటీ ఏర్పాటు నిబంధనల ప్రకారం జరగనందున సెక్రటరీ దీనిపై ముందడుగు వేయటం లేదు. దీంతో ఇప్పుడు సెలక్ట్ కమిటీపై అనిశ్చితి నెలకొంది. కొద్ది రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తాను మంత్రిని అయినంత మాత్రాన కార్యదర్శికి తాము ఏది చెపితే అది చేయరని..నిబంధనల ప్రకారం ఉంటేనే ముందుకెళ్ళగలరని వ్యాఖ్యానించారు. అయితే ప్రతిపక్ష టీడీపీ మాత్రం అధికార వైసీపీ సెక్రటరీపై ఒత్తిడి తెచ్చి సెలక్ట్ కమిటీకి సంబంధించిన నోటిఫికేషన్ రాకుండా చేస్తోందని ఆరోపిస్తోంది. దీంతో అసలు ఈ కమిటీ ఉంటుందా..లేదా అన్న అంశం గందరగోళంలో పడింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం అధికారికంగా తమకు లేఖలు రాకపోయినా సెలక్ట్ కమిటీకి సంబంధించి పేర్లను మండలి ఛైర్మన్ కార్యాలయానికి పంపాయి. నిబంధనల ప్రకారం ముందుకెళతామని కొద్ది రోజుల క్రితం మండలి ఛైర్మన్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
కానీ ఆ దిశగా ఎలాంటి పురోగతి లేదనే చెప్పాలి. అయితే తాజాగా టీడీపీ తరపున మూడు రాజధానుల అంశంపై సెలక్ట్ కమిటీకి నారా లోకేష్, అశోక్ బాబు, తిప్పేస్వామి, బీటీ నాయుడు, సంధ్యారాణి పేర్లను, సీఆర్ డీఏ బిల్లుకు దీపక్ రెడ్డి, బచ్చుల అర్జునుడు, బీద రవిచంద్ర, జీ. శ్రీనివాసులు, బుద్ధా వెంకన్న పేర్లు ఇచ్చారు. బిజెపి తరపున రాజధానులపై మాధవ్ పేరును, సీఆర్ డీఏ బిల్లుకు సోము వీర్రాజు పేరు పంపారు. పీడీఎఫ్ తరపున మూడు రాజధానుల బిల్లుకు కె ఎస్ లక్ష్మణరావు, సీఆర్ డీఏ బిల్లుకు ఐ. వెంకటేశ్వరరావు పేర్లు ప్రతిపాదించారు. అధికార వైసీపీ మాత్రం మౌనంగా పరిణామాలను వేచిచూస్తోంది. అసలు సెలక్ట్ కమిటీ అనేది అమలుకు నోచుకుంటుందా..లేదా అన్న అనుమానాలు ప్రభుత్వ వర్గాల్లో ఉన్నాయి.



