Telugu Gateway
Politics

నేరస్థులకు టిక్కెట్లు ఎందుకిచ్చారో పార్టీలు చెప్పాలి

నేరస్థులకు టిక్కెట్లు  ఎందుకిచ్చారో పార్టీలు చెప్పాలి
X

రాజకీయాలు నేరమయం కావటంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ఇచ్చిన తీర్పును మరింత కఠినం చేసింది. ఏ రాజకీయ పార్టీ అయినా నేరస్ధులకు టిక్కెట్ ఇస్తే అందుకు కారణాలను కూడా ఖచ్చితంగా బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు తమ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే నేరచరిత్ర కలిగిన అభ్యర్ధుల గురించి పూర్తి సమాచారాన్ని పార్టీ వెబ్‌సైట్‌ల్లో ఉంచటంతోపాటు, ప్రింట్‌ మీడియా ద్వారా బహిర్గతం చేయాలని అన్ని రాజకీయ పార్టీలను సుప్రీం ఆదేశించింది. అభ్యర్ధుల కేసులు, అభియోగాలు, విచారణ ఏ దశలో ఉంది అనే వివరాలను సమగ్రంగా వెల్లడించడంతో పాటు అలాంటి అభ్యర్ధులను ఎందుకు ఎంపిక చేశారో వివరణ కూడా ఇవ్వాలని పేర్కొంది. సదరు అభ్యర్థిని ఎంపిక చేసిన మూడు రోజుల్లోగా ఎన్నికల కమిషన్‌కు కూడా ఈ వివరాలను నివేదించాలని తెలిపింది.

ఈ సమాచారాన్ని తమ ఎవరైనా ఇవ్వకపోయినా లేదా ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేయకపోయినా ఎన్నికల కమిషన్‌ కోర్టు ధిక్కార చర్యలను చేపట్టవచ్చని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. 2018లో ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పు సరిగా అమలు కావటం లేదంటూ ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయటంతో ఈ కేసు విచారించిన కోర్టు తాజా ఆదేశాలు జార చేసింది. గత నాలుగు సార్వత్రిక ఎన్నికల నుంచి రాజకీయాల్లో నేరస్థుల సంఖ్య పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును కొంత మంది అపహస్యం చేస్తూ ఎవరూ చూడని పత్రికల్లో, టీవీల్లో యాడ్స్ ఇచ్చి తప్పించుకుంటున్నారని పిటీషన్ ఆరోపించారు. అభ్యర్ధులు తమ నేర చరిత్ర వివరాలను ప్రచురించాల్సిన పత్రికలు, టీవీల జాబితాను ఈసీ రూపొందించేలా చూడాలని కోరారు.

Next Story
Share it