Telugu Gateway
Andhra Pradesh

సిట్ ఓకే...కానీ జగన్ కు ‘కేబినెట్ చిక్కులు’!?

సిట్ ఓకే...కానీ జగన్ కు ‘కేబినెట్ చిక్కులు’!?
X

కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నిస్తే జగన్ కు సమస్యలే!

ఆయన కేసులపైనే ప్రభావం చూపిస్తుంది అంటున్న ఐఏఎస్ లు

గత ప్రభుత్వ హయాంలో అక్రమాలను నిగ్గుతేల్చేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు ‘సిట్’ వేసింది. దీంట్లో ఆక్షేపించాల్సింది ఏమీలేదు. కానీ ఇక్కడే ఓ చిక్కు ఉంది. అది కేబినెట్ రూపంలో అడ్డం పడబోతోంది. అదేంటి?. కేబినెట్ లో జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించే వాళ్లు ఉంటారా అన్నదే కదా మీ డౌట్. జగన్ నిర్ణయాలను వ్యతిరేకించటం కాదు..ఏ ముఖ్యమంత్రి నిర్ణయాలను అయినా మంత్రులు ప్రశ్నించే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు కొత్తగా వస్తాయనే ఆశ కూడా ఎవరికీ లేదు. నిబంధనలకు విరుద్ధంగా, అధికారులు అభ్యంతరాలు చెప్పినా పలు సంస్థలు, కాంట్రాక్టర్లకు మేలు చేసే నిర్ణయాలను గత ప్రభుత్వం తీసుకుంది. స్విస్ ఛాలెంజ్ దగ్గర నుంచి ఇలాంటి కేసులు ఎన్నో. ఎవరు వ్యతిరేకించినా సరే చంద్రబాబు కేబినెట్ ఆమోద ముద్ర వేయించి ఓకే చేయించుకునేవారు. మంత్రిమండలి ఓకే చేశాక అధికారులు చేయగలింది కూడా ఏమీ ఉండదు.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఫైళ్ళలో రాసిన వాళ్ళు సేఫ్. అలా కాకుండా చంద్రబాబు ఏధి ఓకే అంటే..అదే రైట్ అన్న వాళ్ళకే కాస్తో కూస్తో చిక్కులు రావొచ్చు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ‘కేబినెట్ నిర్ణయాలను’ కూడా ప్రశ్నించొచ్చు. తప్పు చేస్తే కేబినెట్ పై కూడా చర్యలు తీసుకోవచ్చు అని వాదిస్తారా?. ఇక్కడే ఓ కిటుకు ఉంది. జగన్ ప్రస్తుతం పలు అవినీతి ఆరోపణ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల సందర్భంగా వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను అసలు ప్రభుత్వంలో ఎక్కడాలేనని..కనీసం ఒక్కసారి కూడా సెక్రటేరియట్ కు వెళ్ళలేదని వాదించారు. వైఎస్ తీసుకున్న నిర్ణయాలు అన్నీ కేబినెట్ నిర్ణయాలు అని ..తనకే మాత్రం సంబంధం లేదని ప్రకటించారు. ఉదాహరణకు ఓ కేసు పరిశీలిద్దాం. హైదరాబాద్ శివారల్లో బ్రాహ్మణీ, ఇందూ టెక్ జోన్ తదితర సంస్థలకు శంషాబాద్ సమీపంలో ఐటి సెజ్ ప్లస్ రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం ఒక్కొక్కరికి 250 ఎకరాల భూమి కేటాయించారు. ఈ కేటాయింపు సమయంలోనే అప్పటి ఐటి శాఖ అధికారి రత్నప్రభ ఈ కేటాయింపులు ఐటి విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని..తాను చేయలేనని తేల్చేశారు.

దీంతో అప్పటి సీఎం వైఎస్ కేబినెట్ లో పెట్టి ఆమోదముద్ర వేయించారు. అందుకే ఈ కేసు నుంచి రత్నప్రభ తేలిగ్గా బయటపడ్డారు. ఒక్క రత్నప్రభే కాదు చాలా మంది అధికారులు అప్పటి కేసుల్లో బయటపడ్డారు. కానీ జగన్ పై కేసులు మాత్రం అలాగే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నందున కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించవచ్చు అని జగన్ సర్కారు స్టాండ్ తీసుకుంటే అది ఆయన కేసుల్లో ఆయనకే చుక్కలు చూపిస్తుందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. వాస్తవానికి కేబినెట్ అంటే కేవలం విధాన నిర్ణయాలు తీసుకుని..వాటి ప్రకారం పాలన చేయాలి. కానీ గత కొన్ని సంవత్సరాలు గా మంత్రివర్గాలు కార్పొరేట్లు, కాంట్రాక్టర్లు, బడాబాబుల కోసం విధానాలు, నిబంధనలను అతిక్రమించి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కేబినెట్ నిర్ణయాలను ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. కానీ జగన్ కు ఆయనపై ఉన్న కేసులు ఇబ్బందిగా మారతాయి అని అధికారులు చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో నిర్ణయాలు తీసుకోవటాన్ని తప్పుపట్టరు కానీ..కేవలం కొంత మందికి మేలు చేసి పెట్టే నిర్ణయాలను కూడా ఆగమేఘాల మీద కేబినెట్లో పెట్టి ఆమోదింపచేసుకుంటున్నారు. సిట్ ఆధారంగా చంద్రబాబును ‘బుక్’ చేయటం అంత తేలికైన విషయం కాదని మరో ఐఏఎస్ తెలిపారు. మొత్తానికి ఈ సిట్ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it