Telugu Gateway
Politics

ఇదేనా రైతులపై కెసీఆర్ ప్రేమ?

ఇదేనా రైతులపై కెసీఆర్ ప్రేమ?
X

సీఎంకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి కెసీఆర్ ఏకంగా పదకొండు గంటల పాటు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడితే అందులో రైతుల గురించి మాట్లాడేందుకు ఐదు నిమిషాల సమయం కూడా చిక్కలేదా? అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతాంగ సమస్యలపై కనీసం సీఎం మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదన్నారు. సీఎం కెసీఆర్ తీరు పట్ల రైతుల తరపున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎంకు రాసిన బహిరంగ లేఖలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. రైతాంగ సమస్యలపై చర్చ జరిగితే రుణమాఫీ, రైతుబంధు, మద్దతు ధర వంటి అంశాలు వస్తాయనే దీని జోలికి పోలేదన్నారు. తెలంగాణలో ఎన్నికలు ఉంటేనే పథకాలు అమలవుతాయని... లేకపోతే అన్నీ అటకెక్కినట్టే అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్న నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ లెక్కలను ఆయన ప్రస్తావించారు. జనాభా ప్రకారం చూసుకుంటే... ఈ విషయంలో తెలంగాణ తొలిస్థానంలో ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

గడిచిన ఆరు నెలల్లో తెలంగాణలో 5,912 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటేనే... పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కేసీఆర్ ఎంతో గొప్పగా చెప్పే రైతు సమన్వయ సమితిలు టీఆర్ఎస్ నేతలకు పునరావాస కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేలా... బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనలో 5912 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. రైతు బంధును ఎన్నికల పథకంగా మార్చారని ఆరోపించారు. సీఎం హామీలపై త్వరలో రైతు సమాజాన్ని సంఘటితం చేసే కార్యక్రమం చేపడతామని ప్రకటించారు.

Next Story
Share it