Telugu Gateway
Politics

దాడి తట్టుకునేలా సూర్య నమస్కారాలు పెంచుతా

దాడి తట్టుకునేలా సూర్య నమస్కారాలు పెంచుతా
X

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై లోక్ సభ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ వ్యంగాస్త్రాలు సంధించారు. రాహుల్ కు ఏ విషయం అయినా అర్ధం కావటానికి చాలా సమయం పడుతుందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోడీ గురువారం నాడు లోక్ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించని పక్షంలో మోదీ సర్కార్‌కు గడ్డుకాలం తప్పదన్న రాహుల్‌ గాంధీ విమర్శలపై మోడీ స్పందించారు. ఆరునెలల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే ప్రధాని మోదీని యువత కర్రలతో బాదుతారని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ ఇస్తూ కర్రల దాడిని తట్టుకునేలా తాను ప్రతిరోజూ చేసే సూర్య నమస్కారాల సంఖ్యను పెంచాలని నిర్ణయించుకున్నానని మోదీ అన్నారు. గత 20 సంవత్సరాలుగా తాను ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రదర్శించిన అంకిత భావం, చొరవతో దశాబ్ధాలుగా అపరిష్కృతంగా ఉన్న రామజన్మభూమి, ఆర్టికల్‌ 370, ట్రిపుల్‌ తలాక్‌ వంటి సమస్యలు కొలిక్కివచ్చాయని చెప్పారు. 2014 నుంచి 2019 వరకూ తమ ప్రభుత్వ పనితీరును మెచ్చిన ప్రజలు తమకు తిరిగి అధికారం కట్టబెట్టారని అన్నారు.

తాము గత పాలకుల బాటలోనే పయనిస్తే ఆర్టికల్‌ 370 రద్దయ్యేది కాదని, ట్రిపుల్‌ తలాక్‌ సమస్య పరిష్కారమయ్యేది కాదని విపక్షాలకు మోదీ చురకలు అంటించారు. అదే సమయంలో నెహ్రుపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ శరణార్థులు, ముస్లిం వలసదారులకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని నెహ్రూ ఒక లేఖలో పేర్కొన్న విషయాన్ని గురువారం మోడీ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని నెహ్రూ అప్పటి అస్సాం ముఖ్యమంత్రి గోపీనాథ్ బర్దోలీకి రాసిన లేఖలో హిందూ శరణార్థులు, ముస్లిం వలసదారులకు అర్థం ఏంటనేది స్పష్టంగా వివరించారని తెలిపారు. పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వలస వస్తున్న మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పించాలని నెహ్రూ లేఖలో చెప్పినట్లు మోదీ ప్రస్తావించారు. పాకిస్తాన్‌లో అణిచివేత, హింసకు గురైన ప్రజలు భారత్‌కు రావాలని భావిస్తే మంచిదే అన్న నెహ్రూ ఒకవేళ ఇందుకు చట్టాలు అనుకూలించకపోతే చట్టసవరణ జరగాలని నవంబర్ 5, 1950లో చెప్పినట్లు మోదీ పార్లమెంట్‌లో వివరించారు. అంత ముందుచూపుతో వ్యవహరించిన నెహ్రూ పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ దేశ పౌరసత్వం ఇవ్వాలని అప్పట్లో ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. హిందూ శరణార్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత భారత భుజస్కంధాలపై ఉందని, దేశంలో ముస్లింల భద్రతకు వచ్చిన ముప్పు ఏమి లేదని మోదీ స్పష్టం చేశారు.

మతపరమైన అణిచివేత లేదా హింస నుంచి తప్పించుకునేందుకు ఒక దేశం నుంచి మరొక దేశంకు వెళ్లాల్సిన దుస్థితి తమకు పట్టలేదంటూ పాకిస్తాన్‌కి చెందిన భూపేంద్రకుమార్‌, జోగేంద్రనాథ్ మండల్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు అక్కడే ఉండిపోయారని మోదీ తెలిపారు. భూపేంద్ర కుమార్ పాకిస్తాన్ చట్టసభలకు ఎన్నికయ్యారని, పాకిస్తాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు ఎక్కువయ్యాయని పాక్ పార్లమెంటులోనే ఆయన తన స్వరాన్ని వినిపించినట్లు తెలిపారు. ఆ తర్వాత భారత్‌కు వలస వచ్చిన భూపేంద్రకుమార్‌ ఇక్కడే మరణించినట్లు మోదీ చెప్పారు. పాకిస్తాన్ తొలి న్యాయశాఖ మంత్రి జోగేంద్ర నాథ్ మండల్ కూడా అక్కడి హిందువులకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారని ప్రధాని మోదీ వెల్లడించారు.1955లో తొలిసారిగా భారత పౌరసత్వ చట్టంకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సంబంధిత చట్టానికి పలు సవరణలు జరిగాయి. తాజాగా డిసెంబర్‌లో మోదీ సర్కార్ పౌరసత్వ చట్టానికి మరిన్ని సంస్కరణలు తెచ్చింది.

Next Story
Share it