Telugu Gateway
Politics

రామ మందిర నిర్మాణంపై మోడీ కీలక ప్రకటన

రామ మందిర నిర్మాణంపై మోడీ కీలక ప్రకటన
X

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సంబంధించి ప్రధాన నరేంద్రమోడీ బుధవారం నాడు లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. మంత్రివర్గ సమావేశం అనంతరం నేరుగా సభకు వచ్చిన ఆయన ఈ అంశంపై స్పందించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ‘‘నవంబరు 9న వచ్చిన తీర్పు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించింది. అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేస్తూ ఈరోజు ఉదయం కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నా. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి.. ట్రస్టును ఏర్పాటు చేశాం. దీనికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రగా నామకరణం చేశాం. మందిర నిర్మాణం కోసం 67.73 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించాం. ఈ ట్రస్టు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది’’అని తెలిపారు.

భారతదేశంలో నివసిస్తున్న అన్ని మతాల ప్రజలు వసుదైక కుటుంబంలో భాగమేనని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం గతేడాది నవంబరులో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సుప్రీంకోర్టు.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల్లో భాగమైన రామ మందిర నిర్మాణానికి ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్‌ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో త్వరలోనే అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Next Story
Share it