Telugu Gateway
Andhra Pradesh

టీడీపీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

రెండు కులాల గొడవలా ఏపీ రాజకీయాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలు, తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాలు రెండు కులాల మధ్య గొడవలా తయారయ్యాయని అన్నారు. తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయి. అయినా ఆ పార్టీ ఇవాళ బలంగా లేదు. దానికి కారణం ఆ పార్టీకి వచ్చిన ఓట్లు డబ్బులతో కొనుక్కున్నవి కావడం. జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు డబ్బుతో కాదు ఇష్టంతో వేసినవి. ప్రతి ఓటు చాలా విలువైనది. అందుకే ఓడిపోయినా కూడా బలంగా ప్రజల తరపున పోరాటాలు చేయగలుగుతున్నాం. అమరావతి విషయంలో తెలుగుదేశం వెనకబడిపోయినా ఇవాళ ఆ ఉద్యమాన్ని జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్లగలుతుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పి.ఎ. దగ్గర రూ. 2000 కోట్లు ఆస్తుల వివరాలు దొరికాయి. దీనిపై స్పందించరా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. జనసేన పార్టీ అవినీతికి సంపూర్ణ వ్యతిరేకం. అందుకే ఎలక్షన్ సమయంలో కూడా ఓటుకు నోటు ఇవ్వకుండా రాజకీయాలు చేశాం.

ఓటుకు డబ్బులు తీసుకోవడం వల్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు కోల్పోతాం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోలేదు. నిజంగా ఓడిపోయి ఉంటే వైజాగ్ లాంగ్ మార్చ్, సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని కర్నూలు లో చేసిన నిరసన ర్యాలీకి లక్షలాది మంది జనం వచ్చేవారు కాదు. ఎన్నికల్లో ఓడినా ప్రజల మనసులు గెలుచుకోగలిగాం. రాజకీయాల్లో అవినీతిని శుభ్రం చేయాల్సింది జనసేన మాత్రమే అని కార్యకర్తలకు ఉద్భోదించారు. గత ఎన్నికల్లో అభిమానులను ఓటర్లు గా మార్చుకోలేకపోయినట్లు అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు రేపల్లే నియోజకవర్గ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ ఉద్యమాలతో మిగిలిపోయే పార్టీ కాదని, ప్రజల మన్ననలతో అధికారం చేజిక్కించుకొనే పార్టీ అన్నారు. కుళ్లు, కుంతంత్రాలు, వెన్నుపోట్లు ఉంటాయని తెలిసే రాజకీయాల్లోకి వచ్చానని... ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. “సినిమాల్లో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు. అవినీతి, ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాలు చూసి ఆవేదనతో రాజకీయాల్లోకి వచ్చాను. కులం, జాతి చూసి ఓటేస్తే ఏ పార్టీ గెలవదు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పటి పరిస్థితులు వేరు. ఓటుకు రెండువేలు, బైక్ లు ఇవ్వడం అప్పుడు లేవు. రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తామని ప్రకటిస్తే ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించారు.

అలాంటి జనం, సమాజం ఇప్పుడు లేదు. సేవ చేస్తామంటే శంకించే పరిస్థితులు వచ్చాయి. ఓట్లు కొనని రాజకీయాలు వస్తేగానీ భవిష్యత్తు మారదు. ఇవాళ వైసీపీ నాయకులు దగ్గరకు పనులు చేయాలని ప్రజలు వెళ్తే... డబ్బులు తీసుకున్నారు కదా మేమెందుకు పని చేయాలని అంటున్నారు. డబ్బులు తీసుకోవడంతో వాళ్లను నిలదీసే హక్కు కోల్పోయారు. రాజకీయాలు అవినీతి బురదతో నిండిపోయింది. దానిని మనమే శుభ్రం చేయాలి. కులం, మతం, ప్రాంతీయత అంటుకోకుండా శుభ్రం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు కులాల మధ్య ఘర్షణలా తయారైంది. మనల్ని పాలించే నాయకులు కులాల పేరుతో పబ్లిక్ గా తిట్టుకుంటున్నారు. ఇలాంటి సంస్కృతిని మార్చాలంటే యువతి, యువకులు రాజకీయాల్లోకి రావాలి. కుల రాజకీయాలు మారాలంటే సరికొత్త రాజకీయ వ్యవస్థ నెలకొల్పాలి. అది జనసేనతోనే సాధ్యమవుతుంది అని వ్యాఖ్యానించారు.అదే సమయంలో తనకు సీఎం జగన్ లా మైన్స్ లేవు..గ్రంధి శ్రీనివాస్ లా అక్వా బిజినెస్ లు లేవు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it