Telugu Gateway
Andhra Pradesh

నేతలు వాటాలు అడగటం ఆపేస్తేనే ఏపీకి పరిశ్రమలు

నేతలు వాటాలు అడగటం ఆపేస్తేనే ఏపీకి పరిశ్రమలు
X

ఏపీకి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలంటే నాయకులు వాటాలు అడగటం మానేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులు అయినా ఎందుకు పారిశ్రామికంగా ఆ ప్రాంతం అభివృద్ధి సాధించలేదని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతం కొన్ని కుటుంబాలు..కొంత మంది వ్యక్తుల చేతుల్లో ఉందని అన్నారు. కానీ జనసేన అధికారంలోకి వస్తే ఆ పరిస్థితి ఉండదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఎందుకు ఐటి హబ్ ను తీసుకురాలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. శుక్రవారం నాడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో కర్నూలు, ఎమ్మిగనూరు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఉందన్నారు. కొత్తగా పరిశ్రమలు రాకపోతే యువతకు ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్ చేయడంతోనే అభివృద్ధి జరిగిపోదని, యువతకు ఉపాధి అవకాశాలు పెంచే ప్రణాళికలు కావాలని స్పష్టం చేశారు. రాయలసీమలోని నాయకులు వేల కోట్లు సంపాదిస్తున్నారుగానీ ప్రజల జీవితాల్లో మార్పు మాత్రం రావడం లేదు.

వాళ్ల మోచేతి నీళ్లు తాగే మనం బతకాలని వారు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ వార్డుకు వెళ్లినా అయిదుగురు జనసైనికులు ఉంటే 500 మంది నా అభిమానులు ఉన్నారు. అభిమానులను జనసైనికులుగా మార్చలేకపోయాం. దీనికి కారణం స్థానికంగా బలమైన నాయకత్వం లేకపోవడం. స్థానికంగా బలంగా ఉండే నాయకులు నా దగ్గరకు రారు. అందుకు కారణం తొలి సమావేశంలోనే ప్రజలకు ఏం చేద్దాం అని అడుగుతాను. అందుకే నన్ను చూడగానే వాళ్లు చిరాకుపడతారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే చాలా మంది మైనార్టీలు నమ్మకం ద్రోహం చేశారని అంటున్నారు. కానీ దశాబ్దాలుగా సెక్యులర్ పార్టీలు అని చెప్పకుంటున్న ఏ పార్టీ కూడా రాయలసీమను అభివృద్ధి చేయలేకపోయింది.

యువతకు ఉపాధి కల్పించలేకపోయింది.జగన్ రెడ్డి రాయలసీమలో ఒక ఐటీ హబ్ ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి, రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలనే లక్ష్యంతోనే బీజేపీతో జనసేన పార్టీ జతకట్టింది. మన జీవితం మారాలంటే పరిశ్రమలు రావాలి .. పరిశ్రమలు రావాలి అంటే పెట్టుబడుదారుల్లో విశ్వాసం రావాలి.అలాంటి పాలనను జనసేన పార్టీ తీసుకొస్తుంది. అతి తర్వలో జనసేన కర్నూలు పార్లమెంట్ కార్యాలయాన్ని కర్నూలు పట్టణంలో పెడతాం. స్థానిక సమస్యలను తెలుసుకోవడానికి ఈ నెల 12, 13 తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటిస్తాన"ని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Next Story
Share it