Telugu Gateway
Andhra Pradesh

జగన్..జెడీలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

జగన్..జెడీలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జనసేనకు ఇటీవలే గుడ్ బై చెప్పిన వీ వీ లక్ష్మీనారాయణలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ ..ఒక్క ఛాన్స్ అని అడిగితే రాష్ట్ర ప్రజలు ఓట్లు వేశారని..ఇప్పుడు రాష్ట్రం కుదేలు అయిందని అన్నారు. తాజాగా జనసేనను వీడిన లక్ష్మీనారాయణపై కూడా పవన్ పేరు ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. ఎన్నికలప్పుడు చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చి... ఇప్పుడు నా పద్దతులు బాగాలేదని విమర్శించి వెళ్లిపోయే వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. భావజాలం కలవనప్పుడు మనుషులు విడిపోతారని, ఇష్టంతో ఉండాలి తప్ప బలవంతంగా ఎవరినీ పార్టీలో ఉండమని చెప్పనని అన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నవారెవరూ కూడా పార్టీ స్థాపించినప్పుడు లేరని గుర్తు చేశారు. పార్టీ పెట్టినప్పుడు నుంచి నాతో ఉన్నది కేవలం జనసైనికులు, ఆడపడుచులేనని తెలిపారు. శనివారం ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ తోపాటు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, తోపుడు బళ్ల మీద టిఫిన్లు అమ్ముకుంటే వచ్చిన డబ్బులతో జనసేన పార్టీ కార్యక్రమాలు చేసిన యువత పార్టీలో ఉన్నారు.

వాళ్లకు నేను అర్ధమవుతున్నాను. కానీ జనసేన పార్టీని ముడి ఖనిజంగా వాడుకొని ఎదగాలనుకొనే వారికి నేను అర్ధంకాను. అలాంటి వాళ్ళు విమర్శించినా నేను పట్టించుకోను అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభాపతిగా ఎంతో ఒత్తిడిని సమర్ధవంతంగా ఎదుర్కొన్న వ్యక్తి నాదెండ్ల మనోహర్. ఆయన పార్టీలోకి రావడానికి ముందు సంవత్సరం పాటు మాట్లాడుకున్నాం. అనేక అంశాలపై చర్చించాం. దేశ సమగ్రత దెబ్బతినని రాజకీయమే చేయాలని, ప్రాంతాలు, మతాలను విభజించే రాజకీయం చేయకూడదని ఆ రోజే నిర్ణయించుకున్నాం. అందుకే ఆయనంటే నాకు గౌరవం. ఇవాళ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతూ నా పద్దతి గురించి విమర్శించే ఏ ఒక్కరైనా కోట్లు కాదుగానీ... స్వశక్తితో సంపాదించిన వెయ్యి రూపాయలు సమాజం కోసం వదులుకోండి చూద్దాం. స్వశక్తితో సంపాదించిన డబ్బును వదులుకోవాలంటే సమాజంపై ప్రేమ, మనుషులపై గౌరవం ఉండాలి. పార్టీనీ, నా మీద ఆదారపడ్డ కుటుంబాలను, నా కుటుంబాన్ని పోషించడానికి సినిమాలు చేస్తున్నాను తప్ప, సినిమాలంటే ఇష్టంతో కాదు. రాజకీయాల్లో అడ్డదారుల్లో వచ్చిన సంపాదనతో నా కుటుంబాన్ని పోషించలేను. నా పిల్లలకు స్కూలు ఫీజులు కట్టలేను. అలా చేస్తే నా మీదే నాకు గౌరవం పోతుంది.

నాకు నేను మోసం చేసుకుంటే ఇంకా ప్రత్యర్ధిని ఏం నిలదీస్తాను. వేలకోట్ల ఆస్తి ఉండి, నెలకో కోటి రూపాయల ఆదాయం వస్తే సినిమాలు చేయాల్సిన అవసరం ఏముంది. అవి లేకే సినిమాలు చేస్తున్నాను.’ అని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత లాభమే చూసుకుంటే జనసేన పార్టీ పెట్టేవాడినే కాదు. బీజేపీలో చేరి కోరుకున్న పదవులు అనుభవించేవాడిని. సమాజహితం కోరుకున్నవాడిని కాబట్టే దెబ్బలు తినడానికైనా సిద్ధపడే జనసేన పార్టీ పెట్టాను. జనసేన పార్టీకి అండ యువత, ఆడపడుచులే. వారి నిబద్ధత, దీవెనలే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేలా చేసింది. జీవితంలో అధికారం వస్తుందో రాదో తెలియదు కానీ మీరు చూపించే ప్రేమ ముందు అధికారం కూడా చిన్నదిగానే అనిపిస్తుంది. ఎవరైన పార్టీలో ఇష్టంతో ఉండాలి కానీ బలవంతంగా ఉంచలేము. పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే పార్టీలో ఉన్నారో లేదో తెలియదు. కాపలా కాసుకొని కూర్చొనే రాజకీయాలు చేయను. ప్రజాప్రయోజనాలు, సమాజహితం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. భావజాలం ఉన్న వ్యక్తులు మనతో నిలబడతారు. అలా లేనివారు వెళ్లిపోతారు. అయితే భవిష్యత్తులో మనల్ని ఇష్టపడే వ్యక్తులే ఎమ్మెల్యేలు అవుతారు. అధికారం కోసం అర్రులు చాచను, అడ్డదారులు తొక్కను, ఎవరి మోచేతి నీళ్లు తాగను. ఏ ఆశయంతోనైతే పార్టీ పెట్టానో ఆ ఆశయం సాధించి తీరుతాను. కష్టాలు, నష్టాలను భరిస్తాను కానీ విలువలు, జనసైనికుల నమ్మకాలను మాత్రం పోగొట్టుకోను. పార్టీ నిర్మాణం అంటే చాలా కష్ట సాధ్యమైంది.

చాలా సహనంతో చేయాలి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన వెంట చాలా మంది మేధావులు నడిచారు. అలాంటి వ్యక్తుల సమూహం మన పార్టీకి లేదు. ఓపిక, సహనంతో రాజకీయాలు చేయాలి. అలా చేస్తేనే విజయం వరిస్తుంది. ఒక్క ఛాన్సు... ఒక్క ఛాన్సు అని అడిగితే ఛాన్సు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రం కుదేలయ్యింది. కృష్ణా నది చెంతనే ఉన్నా తాగడానికి నీళ్లు లేవు. తాగు నీరు డ్రైనేజీ పైపులైన్లతో కలిసిపోవడం వల్ల కలుషితంగా మారుతుంది. వేరే పార్టీకి ఓటు వేశారని రేషన్ కార్డు, ఇళ్ల పట్టాలు ఇవ్వని పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మారాలి. ప్రభుత్వం ప్రజలందరి కోసం పనిచేయాలి. మనుషులను కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడగొట్టడం చాలా తేలిక, కలపడం చాలా కష్టం. నిజమైన పార్టీ నిర్మాణం ఇప్పుడే మొదలైంది. పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థల ఎన్నికలు అద్భుతమైన అవకాశం. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి పెద్దపీట వేస్తాం. పార్టీ నిర్మాణంలో యువత, ఆడపడుచులు మూడో వంతు ఉండేలా నియోజకవర్గ ఇన్ ఛార్జులు చూసుకోవాలి. కష్టపడేవారిని గుర్తించి వారికి తగిన బాధ్యతలు అప్పగించాలన్నారు.

Next Story
Share it