రాజధాని భూములిచ్చి ప్రజల మధ్య చిచ్చుపెడతారా?
పేదల ఇళ్ళ స్థలాల కోసం రాజధాని కోసం సేకరించిన భూములు కేటాయించాలని సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని జనసేన తప్పుపట్టింది. నిర్దేశిత అవసరాల కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు కేటాయిస్తే లేనిపోని వివాదాలు వస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వటాన్ని ఎవరూ తప్పుపట్టరని..అయితే రాజధాని భూములు ఇవ్వటం లేనిపోని వివాదాలు సృష్టించటమే అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూములే ఇళ్ల పట్టాలకు కేటాయించాలని కోరారు.
ఓ వైపు రాజధాని కోసం భూములు ఇఛ్చిన రైతులు ఉద్యమిస్తుంటే ఇప్పుడు అవే భూములను ఇళ్ళ స్థలాల కోసం కేటాయించటం ప్రజల మధ్య చిచ్చు పెట్టడమేనన్నారు. రాజధాని కోసం ఇచ్చిన భూములను పేదలకు ఇఛ్చి చేతులు దులుపేసుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. తర్వాత వచ్చే చట్టపరమైన చిక్కులతో ప్రజలు ఇబ్బంది పడతారని తెలిపారు. అసైన్డ్ భూములు, స్మశాన భూములు, పాఠశాల మైదానాలను ఇళ్ళ స్థలాలుగా మార్చాలని నిర్ణయించటం ఈ పథకంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిన తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు.
పార్టీ నేతలను కించపర్చేవారిపై చర్యలు
గతంలో పార్టీలో ఉండి.. ఆపై ఇతర పార్టీలకు అమ్ముడుపోయి ఇప్పటికీ పార్టీలో ఉన్నామని చెప్పుకొంటూ కొందరు సామాజిక మాధ్యమాలలో పార్టీని, పార్టీ విధానాలను, ముఖ్య నాయకులను, కార్యనిర్వాహకులను కించపరుస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్న విషయం పార్టీ దృష్టికి చేరింది. పార్టీ సిద్ధాంతాలపై గౌరవంగానీ, అధ్యక్షుల వారిపై అభిమానంగానీ లేనివారే ఈ తరహా వ్యాఖ్యలకు దిగుతున్నారు. దురుద్దేశపూర్వకంగానే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వారిని ఉపేక్షించకూడదని పార్టీ లీగల్ సెల్ నిర్ణయించింది. రెండు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో లైవ్ వీడియోలు పెడుతూ, ఫేస్ బుక్, వాట్సప్ ల్లో పోస్టులు పెడుతూ దుష్ప్రచారం చేస్తున్న విషయం లీగల్ సెల్ గుర్తించింది. ఈ విధమైన తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియను చేపడతాం. ముందుగా లీగల్ నోటీసులు జారీ చేసి, తదుపరి క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించాం.