Telugu Gateway
Politics

తెలంగాణపై కేంద్రం వివక్ష..కెసీఆర్

తెలంగాణపై కేంద్రం వివక్ష..కెసీఆర్
X

కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. నీతి అయోగ్ సిఫారసులను కూడా పక్కన పెట్టి..నిధుల్లో కోత పెట్టడం ద్వారా తెలంగాణపై వివక్ష చూపిస్తున్నారని కెసీఆర్ ఆరోపించారు. కేంద్రాన్ని నమ్ముకోవటం వల్ల రాష్ట్రంలో అమలు చేయతలపెట్టిన పలు కీలక పథకాలు దెబ్బతినే పరిస్థితి వచ్చిందని తెలిపారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను తగ్గించటం దారుణం అని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై కెసీఆర్ నాలుగు గంటల పాటు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ప్రగతి కాముక రాష్ట్రమైన తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల్లో భారీ కోతలు విధించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రాజ్యాంగ పరమైన హక్కు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.19,718 కోట్లు రావాల్సి ఉంది. గత ఏడాది బడ్జెట్లో ఈ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రానికి అందిస్తామని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. కానీ సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.15,987 కోట్లకు కుదించారు.

దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3,731 కోట్లు తగ్గాయి. కేంద్రం నుంచి రూ.19,718 కోట్లు వస్తాయనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళిక కేంద్రం నిధుల్లో కోత విధించడం వల్ల తారు మారు అయింది. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా తగ్గించడం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అసమర్థత మాత్రమే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేసి, రాష్ట్రాలకు నిధులు సమకూర్చాల్సి ఉంది. ప్రతీ సందర్భంలోనూ బడ్జెట్లో ప్రకటించిన అంచనాల ప్రకారమే రాష్ట్రాలకు పన్నుల్లో వాటా చెల్లిస్తారు. ఒకటీ అరా శాతం అటూ ఇటు అయిన సందర్భాలున్నాయి కానీ, 2019-20 సంవత్సరంలో ఏకంగా 18.9 శాతం తగ్గుదల రావడం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహరాల నిర్వహణలో లోపానికి నిదర్శనం. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై దారుణంగా పడిందని తెలిపారు. కేంద్రం చెప్పే మాటలకు ..ఇచ్చే నిధులకు మధ్య పొంతన ఉండటంలేదన్నారు.

Next Story
Share it