Telugu Gateway
Andhra Pradesh

మోడీ దృష్టికి మూడు రాజధానుల వ్యవహారం

మోడీ దృష్టికి మూడు రాజధానుల వ్యవహారం
X

ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల వ్యవహారాన్ని తీసుకెళ్ళారు. అంతే కాదు..హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు కూడా సహకరించాలని కోరారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధానితో గంటకుపైగా సమావేశం అయిన జగన్ పలు అంశాలను ప్రధాని మోడీకి నివేదించారు. ప్రత్యేక హోదాతోపాటు స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టు, పోలవరం ప్రాజెక్టు, మండలి రద్దు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశాన్ని మోడీతో ప్రస్తావించారు. ప్రధాని మోడీకి జగన్ ఇచ్చిన వినతిపత్రంలోని అంశాలు....రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి, అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికోసం పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కోసం ప్రణాళికలు రూపొందించుకున్నామని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ గా అమరావతిగా ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు.

దీనికోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020 కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందనే విషయాన్ని కూడా ప్రధాని దగ్గర జగన్ ప్రస్తావించారు. శాసన మండలి సర్కారు పనులకు ఎలా ఆటంకం కలిగిస్తుందో వివరించి సాధ్యమైనంత త్వరగా శాసనమండలి రద్దుకు సహకరించాలని కోరారు. ఉగాది రోజున ఒకేసారి భారీ ఎత్తున నిర్వహించనున్న 25 లక్షల ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని మోడీని ఆహ్వానించారు. అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పుభూములను ఇళ్ల స్ధలాల కోసం ఇవ్వాల్సిందిగా కోరారు. 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని , ముంపు ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను తరలించడానికి సహాయ,పునరావాస పనులను అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం చేయాల్సి ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. దీంతోపాటు పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55549 కోట్లకు చేరిందని, ఇందులో ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసమే రూ.33010 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని తెలిపారు.

కేంద్ర జలవనరులశాఖలోని సాంకేతిక సలహా కమిటీ పోలవరం అంచనాలను రూ.55549 కోట్లగా ఫిబ్రవరి 2019న అంచనాలు వేసిన అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్ళారు. దీనికి పరిపాలనా పరమైన అనుమతులు ఇంకా రాలేదని, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలపాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ.3320 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూలోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్‌ అంచనా వేసిందని, ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇప్పించగలరంటూ వినతి. ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయని, గత ప్రభుత్వంలో ఏ యేడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువే అని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్ధికశాఖను ఆదేశించాలని విజ్ఞప్తి. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టానికి కూడా ఆమోదం లభించేలా సహకరించాలని మోడీని జగన్ కోరారు.

Next Story
Share it