Telugu Gateway
Cinema

‘జాను’ మూవీ రివ్యూ

‘జాను’ మూవీ రివ్యూ
X

ప్రతి ఒక్కరి జీవితంలోనూ పాఠశాల ‘ప్రేమ’ ఉంటుంది. కాకపోతే అది అందరూ వ్యక్తం చేయలేరు. ఆ ప్రేమ మాటల్లో కంటే..కళ్ళల్లోనే ఎక్కువ కనపడుతుంది. ఆ విషయం చూసే వాళ్ళకు తెలుసు...పక్కన ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. కానీ చాలా వరకూ పాఠశాల ప్రేమలు ‘మూగ ప్రేమ’లుగా మిగిలిపోతాయి. ఎందుకంటే స్కూల్ నుంచి బయటకు వచ్చాక ఎక్కువ శాతం ఎవరి దారి వారిదే అవుతుంది. అయితే ప్రతి ఒక్కరి జీవితంలోనూ పాఠశాల ప్రేమకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అది బయటకు చెప్పి ఉండొచ్చు..చెప్పకపోవచ్చు కూడా. కానీ ఆ ప్రేమ మహత్యం వేరు..ఆ భావన వేరు. సరిగ్గా ‘జాను’ సినిమా అలాంటిదే. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి తమ ‘తొలి ప్రేమ’ జ్ణాపకాలు తట్టిలేపుతాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన 96 సినిమాకు తెలుగు రీమేక్ సినిమానే జాను. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే కె.రామచంద్ర‌(శ‌ర్వానంద్‌) ట్రావెల్ ఫొటోగ్రాఫ‌ర్‌గా కొత్త కొత్త ప్రదేశాలను తమ కెమెరాలో బంధిస్తూ తిరుగుతుంటాడు. అదే క్రమంలో కొంత మంది విద్యార్ధులకు ఫోటోగ్రఫీలో శిక్షణ ఇస్తాడు.

త‌న స్టూడెంట్‌తో కలసి వైజాగ్ వ‌చ్చిన రామ‌చంద్రకు అక్క‌డ స్కూల్‌, థియేట‌ర్‌ను చూడ‌గానే త‌న గ‌త జ్ఞాపకాలు గుర్తుకువ‌స్తాయి. అప్పుడు త‌న‌తో పాటు 10వ త‌ర‌గ‌తి చ‌దువుకున్న ముర‌ళి(వెన్నెల‌కిషోర్‌), స‌తీష్‌(తాగుబోతు ర‌మేశ్‌)ల‌కు ఫోన్ చేస్తాడు. అప్పుడే అంద‌రూ హైద‌రాబాద్‌లో రీ యూనియ‌న్ కావాల‌నుకుంటారు. అక్కడ నుంచే అసలు సినిమా కథ ప్రారంభం అవుతుంది. స్కూల్ లో రామచంద్ర, జానకిల ప్రేమ నడిచిన విధానం, మధ్యలో సడన్ గా రామచంద్ర స్కూల్ నుంచి టీసీ తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోవటం. కాలేజీలో చేరిన తర్వాత జానకి, రామచంద్రల మధ్య గ్యాప్ ఏర్పడటం, చివరకు వీళ్ళ ప్రేమ సక్సెస్ అయిందా? లేదా అన్నదే జాను సినిమా. అయితే ఈ సినిమా అంతా శర్వానంద్, సమంతల చుట్టూనే తిరుగుతుంది.

సినిమా భారాన్ని అంతా వీరిద్దరే మోశారని చెప్పొచ్చు. సినిమాలో చిన్నప్పటి రామ్, జానులుగా నటించిన సాయికుమార్, గౌరీల నటన సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య స్కూల్ లో వచ్చే సన్నివేశాలు..రామ్ తన ప్రేమను వ్యక్తపర్చలేక పడే కష్టాలు అత్యంత సహజంగా కన్పిస్తాయి. అయితే ఈ సినిమాలో రామ్ పాత్ర‌లో శ‌ర్వా.. జానకి పాత్ర‌లో స‌మంత తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని హృదయాన్ని భారంగా మారుస్తాయని చెప్పొచ్చు. కీలకమైన ప్రేమ సన్నివేశాల సమయంలో వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫీల్ మరింత పెంచేలా చేసింది. భావోద్వేగాలు పండించే సీన్లలో శర్వానంద్, సమంతల నటన హైలెట్ గా నిలుస్తుంది. కాకపోతే సినిమా చాలా స్లోగా నడిచిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. ఓవరాల్ గా చూస్తే ‘జాను’ పాత ప్రేమలను గుర్తుకు తెస్తుంది.

రేటింగ్. 2.75/5

Next Story
Share it