‘హిట్’ మూవీ రివ్యూ
సినిమా అన్న తర్వాత హిట్..ఫ్లాప్ సహజం. అసలు టైటిల్ లోనే ‘హిట్’ పేరు పెట్టుకుని రావటం అంటే..అది ఓ రకంగా సాహసమే అని చెప్పొచ్చు. విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నటించిన సినిమానే ఈ ‘హిట్’. ఈ చిత్ర నిర్మాత హీరో నానికి చెందిన ‘వాల్ పోస్టర్ ’ బ్యానర్ మీద తెరకెక్కించటంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను తొలి సినిమానే గ్రిప్పింగ్ గా తెరకెక్కించటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అసలు సినిమాలో హిట్ అంటే హోమ్ సైడ్ ఇంటర్ వెన్షన్ టీమ్. పోలీసు విభాగానికి చెందిన ఈ టీమ్ లో పనిచేస్తుంటాడు హీరో విశ్వక్ సేన్. సినిమా అంతా ఇద్దరు అమ్మాయిల కిడ్నాప్ చుట్టూ తిరుగుతుంది. ఈ కిడ్నాప్ అయిన వారిలో ఒకరు హీరో లవర్, మరొకరు కాలేజీ అమ్మాయి. కాలేజీ అమ్మాయి ఔటర్ రింగు రోడ్డు(ఓఆర్ఆర్) నుంచి అదృశ్యం అయిపోతుంది. కానీ ఎంతకూ కారణాలు అంతు చిక్కవు. తర్వాత హీరోయిన్ ఇంటి నుంచే మిస్ అవుతుంది. అసలు ఈ కిడ్నాప్ లు చేసింది ఎవరు చేశారు...దీని వెనక ఉన్న లక్ష్యం ఏమిటి అన్నది చేధించటమే హిట్ సినిమా. ఈ కేసు ను చేధించటంలో ఎదురయ్యే సవాళ్లు, గందరగోళాలు అన్నింటిని ఆసక్తికరంగా తెరకెక్కించటంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు.
ఈ సినిమాలో హిట్ అధికారిగా నటించిన విశ్వక్ సేన్ కు హత్య వంటి సంఘటనలు చూసినప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇలాగే కొనసాగితే గుండె కు ప్రమాదం అని డాక్టర్లు చెప్పినా కూడా లెక్కచేయకుండా విధుల్లో కొనసాగుతాడు. హెల్త్ డిజార్డర్ తో పనిచేసే హిట్ అధికారిగా విశ్వక్ సేన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సీరియస్ పాత్రలోనూ అక్కడక్కడ నవ్వులు పూయిస్తూ సినిమా భారం అంతా తనమీదే వేసుకున్నాడని చెప్పాలి. హీరోయిన్ రుహానీ శర్మ పాత్ర నిడివి పెద్దగా లేదు. ఇతర కీలక పాత్రల్లో కన్పించిన మురళీశర్మ, శివాజీ, భానుచందర్, హరితేజలు తమ పాత్రలకు న్యాయం చేశారు. వివేక్ సాగర్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. సినిమాలో ఒక్కటంటే ఒక్క పాట లేకపోయినా సినిమా ఉత్కంఠగా సాగిపోతుంది. కొంత నిడివి ఎక్కువైనట్లు అన్పించినా ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను దర్శకుడు కూల్ గా నడిపించారు. కాకపోతే ఉత్కంఠ రేపిన సినిమాలో క్లైమాక్స్ మాత్రం చాలా వీక్ గా ఉన్నట్లు అన్పిస్తుంది. ఓవరాల్ గా ‘హిట్’ సినిమా హిట్టే.
రేటింగ్.3./5