Telugu Gateway
Politics

తలసానికి ఐదు వేల జరిమానా

తలసానికి ఐదు వేల జరిమానా
X

జీహెచ్ఎంసీ ఏకంగా తెలంగాణ మంత్రికే జరిమానా విధించింది. అనధికారికంగా నగరంలో ఎక్కడా కటౌట్లు పెట్టకూడదని సాక్ష్యాత్తూ పురపాలక శాఖ మంత్రి కెటీఆర్ పలుమార్లు ఆదేశించారు. తమ పార్టీ నేతలు పెట్టినా కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. అయినా కూడా అప్పుడప్పుడు నగరంలో ఈ కటౌట్ల సందడి తగ్గటంలేదు. తాజాగా ముఖ్యమంత్రి కెసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో భారీ హంగామా ఏర్పాటు చేశారు. పలు చోట్ల హోర్డింగ్ లతోపాటు కటౌట్లు కూడా ఏర్పాటు చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ కటౌట్లు ఉండటతోం జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌ మెంట్ విభాగం మంత్రికి ఏకంగా 5వేల జరిమానా విధించింది. ఈ జరిమానాను మంత్రి ఫ్యామిలీ వెంటనే చెల్లించింది కూడా. నెక్లెస్ రోడ్డు ప్రారంభంలో ‘హ్యాపీ బర్త్‌ డే సర్‌.. ఉయ్‌ లవ్‌ కేసీఆర్‌..’ అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేరిట ఈ కటౌట్‌ ఉండటంతో ఆయనకు చలానా జారీ చేశారు.

ఇందులో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ల చిత్రాలు ఉన్నాయి. ఈ అనధికార హోర్డింగ్‌వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ‘సురక్ష యోజన వెల్ఫేర్‌ సొసైటీ’ ట్విటర్‌ ద్వారా జీహెచ్‌ఎంసీ కమిషనర్, టీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎంవో కార్యాలయం, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌యాదవ్‌ల పేరిట పోస్ట్‌ చేసింది. ఈవీడీఎం డైరెక్టర్‌తో పాటు మరికొందరు జీహెచ్‌ఎంసీ అధికారులు, మున్సి పల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌లకు కూడా కాపీ పోస్ట్‌ చేసింది. చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీని కోరడంతోపాటు తీసుకున్న చర్యల నివేదికను కూడా పంపాలంది. దీంతో ఈవీడీఎం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేరు, ఇంటిచిరునామాలతోనే చలాన్‌ను జారీ చేసింది.

Next Story
Share it