Telugu Gateway
Politics

ట్రంప్ బస చేసే సూట్ అద్దె రోజుకు 8 లక్షలు!

ట్రంప్ బస చేసే సూట్ అద్దె రోజుకు 8 లక్షలు!
X

అమెరికా అధ్యక్షుడి పర్యటన అంటే ఆ హంగామా మామూలుగా ఉండడు. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత్ పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో ఆయన భారత్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటనకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న ఐటిసి మౌర్యలో ట్రంప్ బస చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని హిందూస్థాన్ టైమ్స్ వెల్లడించింది. ట్రంప్, ఆయన భార్య మెలానియాలు గ్రాండ్ ప్రెసిడెన్సియల్ ఫ్లోర్ లోని చాణక్య సూట్ లో బస చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సూట్ అద్దె రాత్రికి ఎనిమిది లక్షల రూపాయలు.

భారతీయ సంప్రదాయ పద్దతిలో ఈ అగ్రరాజ్య అతిథులకు హోటల్ నిర్వాహకులు స్వాగతం పలకనున్నారు. ట్రంప్ తన పర్యటనలో భాగంగా తొలుత అహ్మదాబాద్ వెళ్ళనున్నారు. అక్కడ భారత ప్రధాని నరేంద్రమోడీతో కలసి మోతోరాలోని ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి లక్షలాది ప్రజలు వస్తారని అంచనా. గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్ కు వెళ్లి అక్కడ ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శిస్తారు ట్రంప్. అక్కడ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. ఆయన పర్యటన ఫిబ్రవరి 25న ముగుస్తుంది.

Next Story
Share it