Telugu Gateway
Politics

ఢిల్లీ పీఠంపై మళ్ళీ కేజ్రీవాలే

ఢిల్లీ పీఠంపై మళ్ళీ కేజ్రీవాలే
X

ఫలించని బిజెపి ప్రయత్నాలు

ఊహించిందే నిజమైంది. ఢిల్లీ పీఠం మళ్ళీ ఆప్ వశం అయినట్లే. దేశ రాజధాని ఢిల్లీలో పాగా వేసి సత్తా చాటాలని ప్రయత్నించిన బిజెపికి నిరాశే ఎదురైంది. ప్రధాన నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు అగ్రనేతలు అందరూ రంగంలోకి దిగి బిజెపి గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ఎన్నికల కమిషన్ ఢిల్లీలో పోలింగ్ జరిగిన రోజు ఓట్ల శాతం వివరాలను రకరకాలుగా ప్రకటించి గందరగోళపర్చినా...కొంత మంది ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసినా అవేమీ నిజం కాదని వస్తున్న ఫలితాలను బట్టి తేలిపోయింది. మంగళవారం నాడు కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఆప్ ఏకపక్షంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ సీట్లు ఉండగా..ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల సమయానికి ఆప్ 54 సీట్ల ఆధిక్యంతో అగ్రస్థానంలో నిలిచింది.

బిజెపి 16 సీట్లలో ఆధిక్యతలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఖాతా తెరిచే పరిస్థితి కూడా కన్పించటం లేదు. కాకపోతే గతంతో పోలిస్తే బిజెపి ఢిల్లీ అసెంబ్లీలో కాస్త పట్టు పెంచుకుందనే చెప్పాలి. ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 36 కాగా ఇప్పటికే 54 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా ఆప్‌ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం, ఆప్‌ సీనియర్‌ నేత మనీష్‌ సిసోడియాలు మంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫలితాల సరళితో ఆప్ కార్యాలయంలో హంగామా నెలకొంది. కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు.

Next Story
Share it