Telugu Gateway
Politics

ఢిల్లీ జడ్జీ బదిలీ కలకలం

ఢిల్లీ జడ్జీ బదిలీ కలకలం
X

సహజంగా ఓ జడ్జి ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ అయితే అది మామూలు వార్త. కేవలం సమాచారం కోసం మాత్రమే. కానీ దేశ వ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్న ఢిల్లీ అల్లర్లపై విచారణ జరుపుతున్న జడ్జి మురళీధర్ ను అకస్మికంగా రాత్రికి రాత్రే బదిలీ చేస్తే అది కలకలమే. ఇప్పుడు అదే జరుగుతోంది. అల్లర్ల సమయంలో పోలీసుల తీరును ఢిల్లీ హైకోర్టు జడ్జి తీవ్రంగా తప్పుపట్టారు. అంతే కాదు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అంతే రెండు రోజులుగా ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించిన పిటీషన్లపై అర్థరాత్రి విచారణ జరిపి, సత్వర ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ మురళీధర్‌ బదిలీకి గురయ్యారు. ఆయనను పంజాబ్‌-హర్యాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనికి సంబంధించిన గెజిట్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు.

తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. వాస్తవానికి మురళీధర్‌ బదిలీ గురించి కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 12వ తేదిన సుప్రీంకోర్టు కొలిజీయం ఆయన బదిలీకి ప్రతిపాదించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అప్పటి నుండి ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ దాడులకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ఆయన బుధవారం అర్థరాత్రి తన నివాసంలో విచారణ జరిపారు. ఢిల్లీ పోలీసులకు కొన్ని కీలక సూచలను సూచిస్తూ జడ్జి మూడు పేజీల తీర్పు పాఠాన్ని వినిపించారు. ఈ విచారణ చేపట్టి 24 గంటలు కూడా గడవక ముందే ఎస్ మురళీధర్ బదిలీ కావడం ప్రాధాన్యతను సంతరిచుకుంది. ఢిల్లీ జడ్జి బదిలీ వ్యవహారంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఈ చర్య మాత్రం సరికాదని..ఇది దేశ ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతుందని ప్రశ్నించారు.

Next Story
Share it