Telugu Gateway
Andhra Pradesh

విచారణ కక్ష సాధింపు ఎలా అవుతుంది?

విచారణ కక్ష సాధింపు ఎలా అవుతుంది?
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన మాజీ పీఎస్ పై జరిగిన ఐటి దాడులకు సమాధానం చెప్పిన తర్వాతే ‘ప్రజా చైతన్యయాత్ర’ చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని.. తప్పుడు ఆరోపణలను ప్రజలు హర్షించరని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపటం కక్ష సాధింపు ఎలా అవుతుందని ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్ష నేతలే విచారణ జరిపించి..చర్యలు తీసుకోండి అని సవాళ్లు విసిరి..మళ్ళీ ఇప్పుడు కొత్త వాదన తేవటం వెనక కారణం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులపై ఏసీబీ దాడులు జరగడం సహజం.. కానీ మాజీ ముఖ్యమంత్రి పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంటి పై ఐటి దాడులు జరగడం తన రాజకీయ జీవితంలో తొలిసారి చూశానన్నారు. శనివారం నాడు విజయనగరంలో బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు.

తనకు సంబంధం లేని వోక్స్ వ్యాగన్‌ కేసుపై సీబీఐ ఎంక్వైరీ వేశారని, ఆ కేసులో తనకు సీబీఐ క్లీన్ చిట్ కూడా ఇచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తాను బిసి మంత్రినే కదా? సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా పదే పదే తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని విపక్ష నేతలను బొత్స ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు.గత ప్రభుత్వంలోని బీసీ మంత్రులపై టార్గెట్‌ అనడం హాస్యాస్పదమన్నారు. తాను బీసీ మంత్రినేనని.. గతంలో పదేళ్లు మంత్రిగా పనిచేశానని తెలిపారు. చంద్రబాబు దగ్గర ఉన్నవారే బీసీ నేతలా.. తాము కాదా అని బొత్స ప్రశ్నించారు.

Next Story
Share it