Telugu Gateway
Andhra Pradesh

అసెంబ్లీ సీట్ల పెంపుపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీ సీట్ల పెంపుపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపు ఇప్పట్లో లేనట్లేనా?. అంటే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ఔననే చెబుతున్నారు. గత ఎన్నికల ముందు వరకూ అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కెసీఆర్ లు అసెంబ్లీ సీట్ల పెంపు కోసం గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ అవేమీ ఫలితాన్ని ఇవ్వలేదు. కాకపోతే రెండు రాష్ట్రాలు ప్రస్తుతానికి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదు. ఈ తరుణంలో కిషన్ రెడ్డ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. దేశం అంతటా అసెంబ్లీ సీట్ల పెంపు జరిగినప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనూ సీట్ల పెంపు జరుగుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్‌ చట్టం ప్రకారం.. ప్రత్యేకంగా రెండు రాష్ట్రాల్లోనే అసెంబ్లీ సీట్లను పెంచడానికి అవకాశం లేదని తెలిపారు.

గత పాలకులు ఏపీ విభజన చట్టంలో ఇష్టం ఉన్నట్లు అనేక అంశాలు పెట్టారని.. అసెంబ్లీ సీట్ల పెంపు అంశం రాత్రికి రాత్రి తీసుకువచ్చిందని అభిప్రాయపడ్డారు. దేశంలో సీట్ల పెంపు పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆలోచన చేయలేదని, అయితే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై న్యాయ శాఖదే తుది నిర్ణయం అని తెలిపారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాలపై పెంపుపై మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అన్నారు. గురువారం ఢిల్లీలో జమ్మూకశ్మీర్ బ్లాక్ లెవల్ ప్రజాప్రతినిధులతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు.

Next Story
Share it