Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై ‘సిట్’

టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై ‘సిట్’
X

తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో సాగిన అక్రమాలు..కుంభకోణాలపై విచారణకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది. మంత్రివర్గ సబ్ కమిటీ తేల్చిన నివేదికలోని అంశాలతోపాటు పలు లావాదేవీలపై ఈ సిట్ విచారణ చేయనుంది. శుక్రవారం రాత్రి ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సిట్ రాజధాని భూముల విషయంతోపాటు పలు ఇతర అంశాలపై కూడా విచారణ చేపట్టనుంది. అంతే కాదు..అవసరం అనుకుంటే ఎవరినైనా కార్యాలయానికి పిలుపించుకోవచ్చు. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) కొల్లి రఘురామ్‌ రెడ్డి నేతృత్వంలో పది మందితో కూడిన ‘సిట్‌’ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలక విధానాలు, ప్రాజెక్టులు, పథకాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు తదితరాలపై సమీక్షించేందుకు జీవో 1411 ద్వారా గతేడాది జూన్‌ 26న మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది.

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో భారీ అక్రమాలు జరిగినట్లు మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది. ఈ నివేదికపై గత అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర చర్చ జరిగింది. ఎవరెవరు అసైన్డ్‌ భూములు కొన్నారు? ఎవరెవరు ఎక్కడెక్కడ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా భూములు కారుచౌకగా దక్కించుకున్నారనే వివరాలను పేర్లు, సర్వే నంబర్లతో సహా సభలో వివరించారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం కోరారు. తమ నుంచి బలవంతంగా అసైన్డ్‌ భూములను కొన్నట్లు కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

Next Story
Share it